Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 10 Jun 2024 05:42 IST

14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణం
ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండేలా నిర్మాణం
ప్రముఖులు, ఆహూతుల కోసం ఐదు గ్యాలరీలు
ప్రధాని రాక సందర్భంగా పటిష్ఠ భద్రతా వలయం
ఐదు ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు
విజయవాడ నగర హోటళ్లలో గదులన్నీ బుకింగ్‌

ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సమీక్ష. చిత్రంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం: రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండే కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది. ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గన్నవరానికి చెందిన రైతులు కంకణాల రమేష్, పొట్లూరి బసవరావు, ద్రోణవల్లి ప్రదీప్, పొన్నం శ్రీరాం, కాజా నెహ్రూలకు చెందిన 14 ఎకరాల స్థలంలో తూర్పు దిశగా వేదిక ఉండేలా చేపట్టిన సభా ప్రాంగణ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ, మరో మూడు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల     ఐదు ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

వర్షాన్ని సైతం తట్టుకునేలా.. 

రుతుపవనాలు ప్రవేశించిన సమయం కావడంతో భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్ఠమైన షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఉంటాయి. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజలకు నాలుగు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ విద్యుత్తు దీపాలతోపాటు సభ జరిగే సమయంలో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపడుతున్నారు.

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం సభా స్థలి ఏర్పాట్లను డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాతో కలిసి
పరిశీలిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌. చిత్రంలో ఇతర ఉన్నతాధికారులు

విమానాశ్రయం నుంచి నేరుగా చేరుకునేలా.. 

విమానాశ్రయానికి ఎదురుగానే సభా వేదిక ఉండటంతో హెలిప్యాడ్‌ల అవసరం లేదు. నేరుగా ప్రముఖులు సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. విమానాశ్రయం ప్రధాన గేట్‌ నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖుల రాకకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రహరీని ఆనుకొని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్‌ బంక్‌ వెనుక భాగంలో వీవీఐపీ వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. సావరగూడెం రోడ్డులోని ఎస్‌ఎల్‌వీ, వీఎన్‌పురం కాలనీ మార్గంలోని ఎలైట్‌ విస్టా లే ఔట్, ఎన్టీఆర్‌ వెటర్నరీ కళాశాల ఆవరణ, ఆర్టీవో కార్యాలయ ప్రాంగణం, మేధా టవర్స్‌లో మొత్తం ఐదు చోట్ల పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తారు. ఆ ప్రాంతాల నుంచి వేదిక వద్దకు చేరుకోడానికి ప్రత్యేకంగా రహదారులను సిద్ధం చేస్తున్నారు.

సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. 

ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా నియమించిన ఐఏఎస్‌లు హరిజవహర్‌లాల్, బాబు వీరపాండ్యన్, కన్నబాబు, హరికిరణ్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో వేగం పెంచాలని ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా పటిష్ఠంగా చేపట్టాలని సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ అధికారులకు సూచించారు. సభా ఏర్పాట్లను డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, రాష్ట్ర రవాణా, రహదారులు, భవనాలశాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న, అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీ, ఐజీలు రాజశేఖర్‌బాబు, అశోక్‌కుమార్, కృష్ణా, ఎన్టీఆర్‌ కలెక్టర్లు డీకే బాలాజీ, డిల్లీరావు, కృష్ణా ఎస్పీ అద్నాన్‌ నయీంఅస్మి, ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ రామకృష్ణతో కలిసి సీఎస్‌ ఆదివారం పరిశీలించారు. ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎస్‌ సూచించారు. ఏర్పాట్ల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ఆదేశించారు. ప్రముఖుల భద్రత, వేదిక, బారికేడింగ్, బ్లాక్‌ల విభజన, పారిశుద్ధ్యం ఏర్పాట్లు, అతిథులకు వసతుల కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చూడాలన్నారు. పార్కింగ్‌ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్‌ రహదారులను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శిబిరాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పెద్దసంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు. 

పెద్ద హోటళ్లలోని గదులన్నీ ఫుల్‌.. 

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖుల కోసం విజయవాడ నగరంలోని పెద్ద హోటళ్లలోని గదులన్నింటినీ ప్రభుత్వం బుక్‌ చేసింది. ఈ నెల 11, 12 తేదీల కోసం ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో గదులను బుక్‌ చేశారు. 

గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం రూపుదిద్దుకుంటున్న ప్రధాన వేదిక, గ్యాలరీల సముదాయం


నియోజకవర్గాలవారీగా పాస్‌ల పంపిణీ: అచ్చెన్నాయుడు 

కేసరపల్లి(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి వీవీఐపీ, వీఐపీ, ఇతరత్రా పాస్‌లను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. వాటిని నియోజకవర్గాలవారీగా పంపిణీ చేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభా స్థలి, ఇతర ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సోమవారం నాటికి     సభా స్థలి తదితర ఏర్పాట్లు పూర్తవుతాయని తెలిపారు. 


10 వేల మంది పోలీసులతో బందోబస్తు..

గుంటూరు, ఏలూరు రేంజ్‌లు, విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఉన్నతాధికారులు, సిబ్బంది సహా దాదాపు 10 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం నుంచి గన్నవరంలోని వేదిక వరకూ 22 కిలోమీటర్ల పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమం జరిగే ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి రక్షణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. ప్రధాని నేరుగా దిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయనికి రానున్నారు. ఎస్పీజీ బృందం ఇక్కడే మకాం వేసి స్థానిక పోలీసులతో కలసి భద్రతను సమన్వయం చేసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం విమానాశ్రయం నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ప్రాంగణం వరకు అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైజన్‌(ఏఎస్‌ఎల్‌) నిర్వహించారు. వాహన శ్రేణి ప్రయాణించే మార్గంలో ట్రయల్‌ నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీజీపీ గుప్తా పలు సూచనలు చేశారు. విజయవాడ సీపీ రామకృష్ణ, ఏలూరు రేంజీ ఐజీ అశోక్‌కుమార్, కృష్ణా ఎస్పీ నయీం అస్మిలతో భద్రతపై ఆదివారం చర్చించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని