Revanth Reddy: భాజపా అభ్యర్థుల విజయానికి కేసీఆరే కృషి చేశారు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy ) అన్నారు.

Updated : 05 Jun 2024 17:26 IST

హైదరాబాద్‌: తెలంగాణలో వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy ) అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన నచ్చితే ఓటు వేయాలని లోక్‌సభ ఎన్నికల్లో కోరామని.. 8 మంది తమ అభ్యర్థులు గెలిచారని చెప్పారు. వందరోజుల పాలన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. 

‘‘అసెంబ్లీ ఓట్ల శాతం కంటే ఎక్కువగా లోక్‌సభ ఎన్నికల్లో వచ్చాయి. కాంగ్రెస్‌ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మేం భావిస్తున్నాం. 8 మంది ఎంపీలను గెలిపించి ఆశీర్వదించారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. 2019 ఎన్నికల్లో మాకు 3 సీట్లు వస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరింది. భారాస ఏడు సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఆ 7 సీట్లలో భాజపాను గెలిపించి అవయవదానం చేశారు. భారాస నుంచి బలహీన అభ్యర్థులను పెట్టి భాజపా నేతల గెలుపు కోసం కేసీఆర్‌ కృషి చేశారు. మెదక్‌లో కాషాయ పార్టీ విజయానికి హరీశ్‌రావు సహకారం అందించారు.’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

రేవంత్‌రెడ్డిని అభినందించిన టీపీసీసీ కార్యవర్గం

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డిని టీపీసీసీ కార్యవర్గం సభ్యులు అభినందించారు. గతంలో మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్.. ఇప్పుడు 8 స్థానాలకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి చేసిన కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుందన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, ఫహీం ఖురేషీ, ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు