‘కర్ణాటక ప్రభుత్వం కూలిపోవచ్చేమో!’.. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Published : 11 Dec 2023 02:13 IST

హసన్‌: జేడీఎస్‌ (JDS) అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి(Kumaraswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం కూలిపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ కీలక మంత్రి భాజపాలో చేరవచ్చన్నారు. కేంద్రం పెట్టిన కేసుల నుంచి బయటపడేందుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, ఆ మంత్రితో పాటు 50 నుంచి 60మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరతారని.. ప్రస్తుతం భాజపాతో చర్చలు జరుపుతున్నారంటూ కుమారస్వామి వ్యాఖ్యానించడం కర్ణాటక రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

డిసెంబర్‌ 19న ‘ఇండియా’ కూటమి సమావేశం?

హసన్‌లో కుమారస్వామి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అంతా సవ్యంగా ఏమీ లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో తెలియదు. ఒక ప్రముఖ మంత్రి తన కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. తప్పించుకొనేందుకు అవకాశం లేకుండా కేసులు నమోదయ్యాయి’’ అన్నారు. అయితే, ఆ మంత్రి ఎవరో చెప్పాలంటూ విలేకర్లు ప్రశ్నించగా.. చిన్న చిన్న నేతలు ఇలాంటి సాహసం చేయరని.. ప్రభావవంతమైన వ్యక్తులు మాత్రమే చేయగలరంటూ సమాధానం దాటవేయడం గమనార్హం. మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటకలో ఏ క్షణమైనా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందని కుమారస్వామి జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిని చూస్తుంటే ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని