Mallikarjun Kharge: ప్రధాని మోదీ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు

హిందూ-ముస్లిం చీలిక తీసుకువచ్చి, విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రధాని మోదీ ప్రతిరోజూ ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Published : 22 May 2024 05:29 IST

ఆయన ప్రజా జీవితం నుంచి వైదొలగాలి
పీటీఐ ముఖాముఖిలో మల్లికార్జున ఖర్గే
 

దిల్లీ: హిందూ-ముస్లిం చీలిక తీసుకువచ్చి, విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రధాని మోదీ ప్రతిరోజూ ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రజా జీవితం నుంచి ఆయన వైదొలగాలని డిమాండ్‌ చేశారు. ‘‘మోదీ ఉద్దేశాలు మంచివి కావు. ప్రజల పశుసంపదను మేం లాక్కొనిపోతామని, బడ్జెట్లో 15 శాతాన్ని ముస్లింలకు ఇచ్చేస్తామని ఎన్నికల సభల్లో ప్రచారం చేయడం ద్వారా  ప్రధానే- విభజనకు ఆజ్యం పోస్తున్నారు. హిందూ-ముస్లిం గురించి తాను మాట్లాడితే ప్రజా జీవితంలో ఉండే హక్కు తనకు ఉండదని ఆయనే అంటున్నారు. కనీసం ఈ విషయంలోనైనా మాటకు కట్టుబడి ఉండాలి. రాజ్యాంగానికి, ముస్లింలకు వ్యతిరేకంగా నేతలు చేసిన వ్యాఖ్యలనైనా ఆయన ఖండించలేదు. సమాజంలో ద్వేషం, విభజన వ్యాప్తిచేసే భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలే పోరాడుతున్నారు’’ అని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఖర్గే చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఆధిక్యం భాజపాకు రాకుండా ఇండియా కూటమి ఆపగలదని ధీమా వ్యక్తంచేశారు. 

భావోద్వేగంతో మోసం 

‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. రామాలయం, హిందూ-ముస్లిం విభజన, భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఘర్షణల పేరుతో భాజపా పదేపదే ప్రజలను భావోద్వేగంతో మోసం చేసింది. భాజపా అసలు రంగును ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి హామీలను భాజపా నెరవేర్చలేకపోయింది. రిజర్వేషన్లు, రాజ్యాంగం అనే రెండు ప్రధానాంశాలు కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని భాజపా మార్చాలనుకుంటోంది. పదవుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులను నియమించాలనుకుంటోంది. భాజపా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోంది. అందుకే ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి’ అని ఖర్గే చెప్పారు. 

అది బుజ్జగింపు ఎలా అవుతుంది?

అన్యాయాలను అడ్డుకోవడం బుజ్జగింపు ఎలా అవుతుందని ఖర్గే ప్రశ్నించారు. మత ప్రాతిపదికన ఓటర్లను ఏకీకృతం చేయడమే బుజ్జగింపు అని, భాజపా దానికి పాల్పడుతోందని ఆరోపించారు. పేదలకు ఉపకార వేతనాలు ఇవ్వడం, ముస్లింలకు ప్రత్యేక బడులు ఏర్పాటు చేయడాన్ని బుజ్జగింపు అనకూడదని చెప్పారు. మోదీ అన్నీ తానే అయి మొత్తం దేశాన్ని నడపాలని అనుకుంటున్నారని విమర్శించారు. మోదీపై వ్యక్తిగతంగా తమ పార్టీకి వ్యతిరేకత లేదని, ఆయన అనుసరిస్తున్న సిద్ధాంతాన్నే తప్పుపడుతున్నామని చెప్పారు.  

అబద్ధాల ప్రధానికి ఓట్లు వేయాలా? 

హరియాణాలో ఎన్నికల ప్రచార సభలో ఖర్గే మాట్లాడుతూ- మోదీ అంటే అబద్ధాలకు రారాజు అని విమర్శించారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపై ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఆయన ఆరోపణలు ఉంటున్నాయని చెప్పారు. ప్రధాని పదవిలో ఉన్నవారు అబద్ధాలు చెబుతుంటే వారికి ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో మోదీకి అర్థంకాకపోతే వివరించి చెప్పడానికి ఎవరినైనా పంపిస్తామని చెప్పారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని