Karnataka CM Post: కర్ణాటక సీఎంపై వీడని సస్పెన్స్‌.. ఖర్గే ఇంటికి రాహుల్‌

కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. దీనిపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే.. అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సమావేశమయ్యారు. ఇప్పటికే కొందరు కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా ఖర్గే నివాసానికి చేరుకున్నారు.

Updated : 16 May 2023 14:57 IST

దిల్లీ: కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రి (Chief Minister) ఎంపికపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సీనియర్‌ నేతలు సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్‌ (DK Shivakumar)ల్లో ఎవరికి పట్టం కట్టాలన్నదానిపై కాంగ్రెస్‌ (Congress) పార్టీ మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఈ క్రమంలోనే సీఎం ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్‌ ఖర్గే (Mallikarjun Kharge) నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌తో పాటు కర్ణాటక నుంచి కొందరు కాంగ్రెస్‌ నూతన ఎమ్మెల్యేలు, నేతలు కూడా పాల్గొన్నారు.

సీఎం ఎంపికపై ఏఐసీసీ పరిశీలకుల బృందం కర్ణాటక నూతన ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించింది. ఆ నివేదికను నిన్న రాత్రి ఖర్గే (Mallikarjun Kharge)కు అందజేసింది. ఈ నివేదికపై ఖర్గే.. రాహుల్‌ గాంధీతో మంతనాలు జరిపినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. ఈ భేటీలోనే సీఎం ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సమావేశం అనంతరం సిద్ధరామయ్య (Siddaramaiah), శివకుమార్‌ (DK Shivakumar)తో ఖర్గే చర్చలు జరపనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM)గా సీనియర్‌ నేత సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.  పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను గౌరవప్రదంగా ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సిద్ధరామయ్య నిన్నటి నుంచి దిల్లీలో ఉండి హైకమాండ్‌తో సుదీర్ఘ మంతనాలు చేస్తుండగా.. శివకుమార్‌ కూడా నేడు దిల్లీకి చేరుకున్నారు. కీలకమైన శాఖలతో ఉపముఖ్యమంత్రి హోదా కట్టబెట్టే అంశంపై డీకేకు సర్దిచెప్పేందుకు అధిష్ఠానం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు హైకమాండ్‌ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని శివకుమార్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని