Congress: కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్‌ షాక్‌!

Congress: కంగనా రనౌత్‌పై కాంగ్రెస్‌ నేత సుప్రియ శ్రీనేత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్‌సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది.

Updated : 28 Mar 2024 19:22 IST

దిల్లీ: ప్రముఖ నటి, భాజపా ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై (Kangana Ranaut) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుప్రియా శ్రీనేత్‌కు (Supriya Shrinate ) కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చింది. తాజాగా విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆమెను పక్కన పెట్టింది.

2019లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌ నుంచి సుప్రియా శ్రీనేత్‌ పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆ స్థానం నుంచి పార్టీ తరఫున వీరేంద్ర చౌదరి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్‌ (Congress) ప్రకటించింది. ఎన్నికల వేళ వివాదానికి తెరతీసిన నేపథ్యంలో ఆమెను పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

హిమాచ్‌ప్రదేశ్‌లోని మండి భాజపా (BJP) అభ్యర్థిగా పోటీ చేయనున్న కంగనా రనౌత్‌కు సంబంధించి సుప్రియా చేసిన ఓ అభ్యంతరకర పోస్ట్‌ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్స్‌ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ ఇతరులను దూషించడం మానుకోవాలంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ పోస్టు చేసింది తాను కాదని.. తన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల యాక్సెస్‌ చాలామంది వద్ద ఉందని సుప్రియ తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు: నిర్మలా సీతారామన్‌

మరోవైపు సుప్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రంలోగా వీటిపై తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చేసిన వ్యాఖ్యలు సందర్భానికి తగ్గట్టు కానీ.. హుందాగా కానీ లేవని ఈసీ ఆక్షేపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో పార్టీలు గౌరవప్రదంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించింది. ఇతర పార్టీల నేతల, కార్యకర్తల ప్రైవేటు జీవితాల గురించి ఎలాంటి విమర్శలు చేయరాదంది. అంతకుముందు జాతీయ మహిళా కమిషన్ (NCW) సైతం సుప్రియ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని