Rajasthan polls: వసుంధరా రాజేకు దక్కిన సీటు.. గహ్లోత్‌, పైలట్‌ పోటీ ఎక్కడినుంచంటే..?

Rajasthan Assembly polls 2023: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌, భాజపా నేడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. వచ్చే ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పోటీ ఖాయమైంది.

Published : 21 Oct 2023 15:44 IST

రాజస్థాన్‌ ఎన్నికలకు భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Rajasthan Assembly polls 2023) దగ్గరపడుతున్న వేళ.. గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్‌ (Congress) పార్టీ శనివారం అభ్యర్థుల తొలి జాబితా (Candidates List)ను విడుదల చేయగా.. అటు భాజపా (BJP) కూడా 83 మందితో రెండో జాబితాను ప్రకటించింది.

ఝల్రాపటన్‌ నుంచే రాజే పోటీ..

రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే (Vasundhara Raje) వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఊహాగానాలకు తెరదించుతూ నేడు వెల్లడించిన జాబితాలో రాజే పేరును భాజపా ప్రకటించింది. తన కంచుకోట ఝల్రాపటన్‌ నుంచే ఆమెను బరిలోకి దించింది. ఈ నియోజకవర్గం నుంచి ఆమె ఇప్పటికే 4 సార్లు విజయం సాధించారు.

కాంగ్రెస్‌ కులగణన హామీపై అఖిలేశ్‌ విమర్శలు

ఇక, మేవాఢ్‌ వీరుడు మహారాణా ప్రతాప్‌ సింగ్‌ వారసుడు విశ్వరాజ్‌ సింగ్‌ మేవాఢ్‌ను నాథ్‌ద్వారా నుంచి నిలబెట్టింది. ఇటీవలే విశ్వరాజ్‌ భాజపాలో చేరారు. అటు ప్రముఖ రాజకీయ నేత భైరాన్‌ సింగ్ షెఖావత్‌ అల్లుడు నర్పత్‌ సింగ్‌ రజ్వీకు కూడా తాజా జాబితాలో చోటు దక్కింది. 83 మందితో భాజపా నేడు రెండో విడత జాబితాను విడుదల చేయగా.. ఇప్పటివరకు 124 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.

కాంగ్రెస్‌లో మార్పుల్లేవ్‌..

అటు కాంగ్రెస్‌ కూడా శనివారం 33 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే, ఇందులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఎప్పటిలాగే.. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) సర్దార్‌పురా నుంచి, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) టోంక్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. స్పీకర్ సీపీ జోషి.. నాథ్‌ద్వారా నుంచి పోటీ చేస్తున్నారు.

రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. కాంగ్రెస్‌ ఇంకా మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఆదివారం పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత మరిన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నవంబరు 25న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబరు 3న ఫలితాలను ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని