Akhilesh Yadav: కాంగ్రెస్‌ కులగణన హామీపై అఖిలేశ్‌ విమర్శలు

Akhilesh Yadav on congress party: కాంగ్రెస్‌ పార్టీపై అఖిలేశ్‌ యాదవ్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. కులగణన హామీ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. 

Updated : 21 Oct 2023 15:33 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి సీట్ల కేటాయించకపోవడం పట్ల అసంతృప్తిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav).. కాంగ్రెస్‌ పార్టీపై (Congress) మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ దేశవ్యాప్త కులగణన హామీ పట్ల తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఆశ్చర్యానికి గురి చేసిందని, గత్యంతరం లేకనే ఆ పార్టీ కులగణన హామీ ఇచ్చిందని దుయ్యబట్టారు.

‘‘కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్త కులగణన హామీ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. వెనుకబడిన వర్గాల ఓట్లు లేకుండా ఎన్నికల్లో గెలవలేమన్న సత్యం ఆ పార్టీకి బోధపడింది. వారు అన్వేషిస్తున్న ఓటర్లు.. తమ వెంట లేరని ఆ పార్టీకి అర్థమైంది. కానీ ఇదే పార్టీ గతంలో కులగణనకు సంబంధించిన గణాంకాలను బయటపెట్టలేదు’’ అంటూ అఖిలేశ్‌ దుయ్యబట్టారు. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కుల గణన గణాంకాలను బయటపెట్టకపోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనను కమల్‌నాథ్‌ ‘వకిలేశ్‌’ అని సంబోధించడంపై మట్లాడుతూ.. ‘‘వకిలేశ్‌ అనే వ్యక్తి లేడు. అఖిలేశ్‌ మాత్రమే ఉన్నాడు. నేనూ అలాంటి సమాధానం ఇవ్వగలను కానీ ఇవ్వాలనుకోవడం లేదు. ఆయన పేరులో కమల్‌ (భాజపా గుర్తునుద్దేశించి) ఉంది కాబట్టి ఆయన్ను ఇంకోలా పిలవం కదా’’ అని అఖిలేశ్‌ అన్నారు.

‘దుబాయ్‌ నుంచి మహువా ఐడీని వాడారు..’: దూబే మరో సంచలన ఆరోపణ

త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి ఒక్క స్థానం కూడా కాంగ్రెస్‌ కేటాయించకపోవడంపై అఖిలేశ్‌ మండిపడుతున్నారు. దీంతో కాంగ్రెస్‌పై విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. ఇండియా కూటమి అనేది కేవలం లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడం కోసమేనని కాంగ్రెస్‌ పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇదే రకమైన అయోమయాన్ని కొనసాగిస్తే మాత్రం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి భాజపాను ఓడించలేదన్నారు. మధ్యప్రదేశ్‌లో తమకు సీట్లు ఇవ్వడం కాంగ్రెస్‌ పార్టీకి ఇష్టం లేకపోతే ముందే ఆ విషయం చెప్పి ఉండాల్సిందన్నారు. తమకు సొంత బలం ఉన్న సీట్లలో పోటీ చేయనున్నట్టు స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని