Rahul Gandhi: రాహుల్‌ గాంధీ జోరు.. రెండుచోట్లా విజయఢంకా

లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. రెండుచోట్లా విజయం సాధించారు.

Published : 04 Jun 2024 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సత్తా చాటారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ కంచుకోట అయిన ‘రాయ్‌బరేలీ (Rae Bareli)’ నుంచి తన సమీప ప్రత్యర్థి, భాజపా నేత దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌పై 3.88 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. 2019లో ఇదే స్థానంలో తన తల్లి సోనియాగాంధీ సాధించిన మెజారిటీని రాహుల్‌ అధిగమించడం విశేషం. తన సిట్టింగ్‌ స్థానమైన కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు. సీపీఐ అభ్యర్థి అనీ రాజాపై 3.64 లక్షల ఓట్ల ఆధిక్యం సాధించారు. భాజపా అభ్యర్థి కె.సురేంద్రన్‌ మూడోస్థానానికే పరిమితమయ్యారు.

కౌంటింగ్‌ కొనసాగుతుండగానే ఓటమిని అంగీకరించిన రాయ్‌బరేలీ భాజపా అభ్యర్థి

తాజా ఫలితాలతో రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ కంచుకోటగా మరోసారి నిరూపితమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడినుంచి మూడుసార్లు, అంతకుముందు ఆమె భర్త ఫిరోజ్‌గాంధీ రెండుసార్లు విజయం సాధించారు. 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆమె రాజ్యసభకు వెళ్లడంతో.. చివరి క్షణంలో రాహుల్‌ అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ క్రమంలోనే పార్టీ విజయపరంపరను ఆయన కొనసాగించారు. వయనాడ్‌లోనూ వరుసగా రెండోసారి గెలుపొందారు. దీంతో ఆయన ఏ స్థానాన్ని వదులుకుంటారోనన్న అంశం ఆసక్తిగా మారింది. మరోవైపు.. అమేఠీలో కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోరీ లాల్‌.. గాంధీల నమ్మకాన్ని వమ్ముచేయలేదు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై 1.31 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు