Ravneet Singh Bittu: భాజపాలో చేరిన కాంగ్రెస్‌ ఎంపీ రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ

లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. ఆ పార్టీ లుధియానా ఎంపీ రవ్‌నీత్‌సింగ్ బిట్టూ భాజపాలో చేరారు.

Published : 26 Mar 2024 22:09 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ రాజకీయ నేతల వలసలు జోరుగా కొనసాగుతున్నాయి.  తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ, పంజాబ్‌ మాజీ సీఎం బియాంత్‌ సింగ్ మనమడు రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ(Ravneet singh bittu) భాజపాలో చేరారు. మూడు సార్లు వరుసగా ఎంపీగా గెలిచిన బిట్టూ ప్రస్తుతం లుధియానా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ పార్టీలో చేరేందుకు వచ్చిన బిట్టూకు కమలనాథులు సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకొనేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

తన చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలను బిట్టూ పొగడ్తల్లో ముంచెత్తారు. పంజాబ్‌ పట్ల ప్రేమ చూపడంతో పాటు రాష్ట్రానికి ఎంతో చేయాలని చూస్తున్న వారిలో ఈ నేతలిద్దరూ ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో భాజపాను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. పంజాబ్‌లో రైతులు, కార్మికులు, పరిశ్రమలకు మధ్య వారధిలా ఉండేలా కృషిచేస్తామన్నారు. పంజాబ్‌లో ఉగ్రవాదం ఉన్న చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్న బిట్టూ.. శాంతి స్థాపన కోసం భాజపా, ఆరెస్సెస్‌ నిర్వహించిన పాత్రను కొనియాడారు. భాజపా ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌డే మాట్లాడుతూ.. బిట్టూ చేరికతో తమ పార్టీ బలపడుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని