Varun Gandhi: కాంగ్రెస్‌లోకి వరుణ్‌ గాంధీ? ఆఫర్‌ ఇచ్చిన హస్తం పార్టీ

Varun Gandhi: భాజపా టికెట్‌ దక్కని ఎంపీ వరుణ్‌ గాంధీ కాంగ్రెస్‌లో చేరనున్నారా? తాజా పరిణామాలతో ఈ ఊహాగానాలకు బలం లభిస్తోంది.

Updated : 26 Mar 2024 14:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి సొంత పార్టీపైనే విమర్శలు చేసి ఇటీవల వార్తల్లో నిలిచారు భాజపా (BJP) ఎంపీ వరుణ్‌ గాంధీ (Varun Gandhi). దీని ఫలితంగానే ఇటీవల పార్టీ ఆయనకు టికెట్‌ నిరాకరించింది. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పీలీభీత్‌ స్థానంలో ఈసారి జితిన్‌ ప్రసాదను నిలబెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ (Congress) ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘ఆయన కాంగ్రెస్‌లో చేరితే మేం సంతోషిస్తాం. వరుణ్‌ విద్యావంతుడు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. కేవలం గాంధీ కుటుంబానికి సంబంధం ఉందన్న కారణంతోనే భాజపా ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. ఆయనను మేం సాదరంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం ’’ అని కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ ప్రకటించారు. దీనిపై పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వరుణ్‌ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జోరందుకుంది.

 కొంతకాలంగా భాజపా కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల తీరుపై వరుణ్‌ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఆయన కేదార్‌నాథ్‌లో కలుసుకోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. భాజపాకు దూరంగా ఉంటున్న ఆయన పార్టీ మారే అవకాశం ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు కమలదళంలో టికెట్‌ దక్కకపోవడంతో మరోసారి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా.. వరుణ్‌ తల్లి మేనకా గాంధీని యూపీలోని సుల్తాన్‌పుర్‌ నుంచి భాజపా మరోసారి బరిలోకి దించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు