Congress: కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల..రాజస్థాన్‌లో సోనియా నామినేషన్‌ దాఖలు

కాంగ్రెస్‌ తన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీనిలో నలుగురికి స్థానం దక్కింది. సోనియా రాజస్థాన్‌ నుంచి పోటీపడనున్నారు. 

Updated : 14 Feb 2024 12:22 IST

ఇంటర్నెట్‌డెస్క్: కాంగ్రెస్‌ (Congress) తరఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేసింది. దీనిలో అందరూ ఊహించినట్లే ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక బిహార్‌ నుంచి అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్‌ హండోరె పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకొన్నట్లు కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటన జారీ చేశారు. 

సోనియా గాంధీ ఇప్పటికే జైపుర్‌ చేరుకొన్నారు. ఆమె వెంట రాహుల్‌,  ప్రియాంక కూడా ఉన్నారు. విమానాశ్రయంలో వారికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ స్వాగతం పలికారు. 12గంటల సమయంలో ఆమె తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఈ ఎన్నికతో తొలిసారి ఆమె పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం ఆమె యూపీలోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడంలేదు.  

రాజస్థాన్‌ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్‌కు దక్కనుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా నిలవబోతున్నారు. 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. పెద్దల సభ సభ్యురాలిగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని