Congress: ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్‌ పిలుపు

₹1,823 కోట్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. శనివారం (మార్చి 30న) దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరింది.

Published : 29 Mar 2024 18:20 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు రావడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఈ కీలక సమయంలో తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక సమయంలో ఐటీ శాఖను తమపై ప్రయోగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడింది. ఇప్పటికే రూ.135 కోట్లు తమ ఖాతా నుంచి బలవంతంగా తీసుకున్నారని.. తాజాగా మరో 1,823.08 కోట్లు చెల్లించాలంటూ నిన్న నోటీసులు ఇచ్చారని పేర్కొంది. ఈ ఆర్థిక ఉగ్రవాదాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో శనివారం (మార్చి 30న) పెద్దఎత్తున నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్న కాంగ్రెస్‌.. ఈ పన్ను ఉగ్రవాదాన్ని నిరసిస్తూ అన్ని పీసీసీల ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సూచించింది. సీనియర్‌ నేతలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరుతూ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అభ్యర్థుల సమక్షంలో నియోజకవర్గాల్లోనూ నిరసనలు చేపట్టాలని సూచించారు.

‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్‌ మండిపాటు

అంతకుముందు ఈ అంశంపై కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు. నోటీసులు, ఖాతాలను స్తంభింపజేయడం వంటి చర్యలతో కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పుడు రూ.1,800 కోట్లు పన్ను చెల్లించాలని నోటీసు ఇచ్చారన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమంటే ఇదేనా? ఎన్నికల సంఘం ఎందుకు మౌనప్రేక్షకుడిలా ఉంటోంది? భాజపాపై కూడా ఇదేరకమైన చర్యలు తీసుకుంటే వాళ్లు రూ.4,600 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ, వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ఐటీ అధికారుల్ని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని.. ఈ చర్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని