Pawan Khera: లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌.. కాంగ్రెస్‌ కీలక నిర్ణయం

ఎగ్జిట్‌పోల్స్‌పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది.

Published : 01 Jun 2024 00:12 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections) సమరం చివరిదశకు వచ్చేసింది. పోలింగ్‌ గడువు ముగిసిన వెంటనే శనివారం సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్‌ (Exit Polls) వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ (congress) కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్‌పోల్స్‌పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల ఛైర్‌పర్సన్‌ పవన్‌ ఖేరా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

పోలింగ్‌ ముగిసేసరికి ప్రజలంతా ఓటుహక్కుతో తమ నాయకులను ఎన్నుకొని ఉంటారని, వారి నిర్ణయం ఈవీఎంలలో భద్రంగా ఉంటుందని చెప్పారు. ఎన్ని చర్చలు పెట్టినా ఆ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని, అలాంటప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం ఊహగానాలను ప్రచారం చేయడం ఎందుకని పవన్‌ ఖేరా ప్రశ్నించారు. జూన్‌ 4న విడుదలయ్యే ఫలితాల్లో విజయం ఎవరిదో తేలుతుందన్నారు. ‘‘ ఎగ్జిట్ పోల్స్‌పై చర్చా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పాల్గొనబోదు. చర్చ ద్వారా ఏదోఒక కచ్చితమైన విషయాన్ని ప్రజలకు చేరవేయాలి. అందుకే జూన్‌ 4 తర్వాత జరిగే చర్చల్లో కాంగ్రెస్‌ పాల్గొంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

సాధారణంగా ప్రతిసారీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడిస్తుంటాయి. తద్వారా ఏయే పార్టీలు ఎన్నెన్ని సీట్లు సాధిస్తాయి, ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది? తదితర విషయాలపై ప్రజలు ఓ అంచనాకు వస్తారు. అయితే, ప్రతిసారీ అంచనాలు నిజం కాకపోవచ్చు.

కాంగ్రెస్‌ తన ఓటమిని అంగీకరించినట్లే.. జేపీ నడ్డా

లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ చర్చల్లో పాల్గొనకూడదని తీసుకున్న నిర్ణయం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ తన ఓటమిని అంగీకరించినట్లేనని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న చివరి దశ పోలింగ్‌లో తమ ఓటును వృథా చేసుకోవద్దని ‘ఎక్స్‌’ వేదికగా ఓటర్లను కోరారు. తనకు అనుకూలమైన ఫలితాలు రాని సందర్భంలో కాంగ్రెస్‌ ముందుగానే వైదొలగడం సాధారణమేనన్నారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలపై, ఎన్నికల ప్రక్రియపై హస్తం పార్టీ ఎలాంటి ఫిర్యాదులు చేయదని.. ఓడిపోయినప్పుడు మాత్రం ఆరోపణలు చేస్తుందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు