AP Election Results: ‘వివేకం’ ప్రదర్శించిన ఓటర్లు

మాజీ మంత్రి వివేకా హత్య... రెండు ఎన్నికలపై ప్రభావం చూపించింది. 2019 ఎన్నికల సమయంలో హత్య జరగడంతో జగన్‌... ఈ నేరాన్ని అప్పటి అధికార పక్షమైన తెదేపాపైకి నెట్టేసి ‘‘నారాసుర రక్తచరిత్ర’’ అంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి ప్రయోజనం పొందారు.

Updated : 05 Jun 2024 07:38 IST

జగన్‌కు ఎదురుతన్నిన వివేకా హత్య కేసు 
2019 ఎన్నికల్లో ‘‘నారాసుర రక్తచరిత్ర’’ అంటూ తెదేపాపై దుష్ప్రచారం 
బాబాయ్‌ని చంపిందెవరో గత ఐదేళ్లలో వెలుగులోకి... 
అయినా, అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డిన జగన్‌ 
పైగా సొంత చెల్లెళ్లపైనే నిందలు 
ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పిన జనం 

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వివేకా హత్య... రెండు ఎన్నికలపై ప్రభావం చూపించింది. 2019 ఎన్నికల సమయంలో హత్య జరగడంతో జగన్‌... ఈ నేరాన్ని అప్పటి అధికార పక్షమైన తెదేపాపైకి నెట్టేసి ‘‘నారాసుర రక్తచరిత్ర’’ అంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి ప్రయోజనం పొందారు. గత ఐదేళ్లలో... ఈ హత్య ఇంటి దొంగల పనేనని వెల్లడవ్వటం, హంతకుల్ని కాపాడుతున్నది జగనేనని తేలడం, సొంత చెల్లెళ్లే జగన్‌ తీరును ఎండగడుతూ ఊరూవాడా ప్రచారం చేయడం, ఈ కేసును అడ్డం పెట్టుకుని గత ఎన్నికల సమయంలో ఆయన నడిపిన కుట్ర, కుతంత్రం బహిర్గతం కావడంతో ఈ ఎన్నికల్లో జనం గుణపాఠం చెప్పారు. 

సొంత బాబాయి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా... 

కడప ఎంపీ అవినాష్‌రెడ్డే ఈ హత్యకు ప్రధాన కుట్రదారని సీబీఐ తేలిస్తే... ఆయన్ని రక్షించేందుకు జగన్‌ సర్వశక్తులూ ఒడ్డారు. దివంగతుడైన తన సొంత బాబాయి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా జగన్, ఆయన అనుచరగణం ప్రచారం చేయడాన్ని చూసి జనాలు నివ్వెరపోయారు. తన తండ్రి హంతకుల్ని చట్టం ముందు నిలబెట్టేందుకు ఒంటరి పోరాటం చేస్తున్న సునీతకు అండగా నిలవాల్సింది పోయి ఆమెను, ఆమె భర్తను అనుమానించేలా మాట్లాడటం, ఆస్తి కోసం వారే ఈ హత్య చేయించారంటూ దుష్ప్రచారం చేయటాన్ని అసహ్యించుకున్నారు. సునీతకు మద్దతుగా నిలిచిన వై.ఎస్‌.షర్మిలను సొంత చెల్లెలని చూడకుండా ‘‘పసుపు చీర కట్టుకుని మోకరిల్లారు’’ అంటూ జగన్‌ మాట్లాడటాన్ని జనం ఈసడించుకున్నారు. అదును చూసి దెబ్బేశారు. 

ప్రతిపక్షంలో ఒకలా... సీఎం హోదాలో మరోలా... 

ఈ కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించొద్దని, రాజకీయ పార్టీలు ఈ హత్య గురించి మాట్లాడొద్దని అప్పట్లో హైకోర్టు నుంచి జగన్‌ గ్యాగ్‌ ఆర్డర్‌ పొందారు. దీంతో 2019 ఎన్నికలప్పుడు అసలు వాస్తవాలు బయటకు రాలేదు. ఆయన గెలిచి అధికారం చేపట్టాక... అసలు స్వరూపం బయటపెట్టుకున్నారు. సునీత, షర్మిలలు అదే విషయాల్ని వెల్లడిస్తుంటే... ఈ హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు ద్వారా మరోసారి గ్యాగ్‌ ఆర్డర్‌ పొందారు. జగన్‌ అమలు చేసిన ఈ ఎత్తుగడలేవీ ఫలించలేదు సరికదా ఎదురుతన్నాయి. ప్రతిపక్షంలో ఉండగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన జగన్‌... సీఎం అయ్యాక సీబీఐ విచారణ అవసరం లేదని తేల్చేశారు. రాష్ట్ర పోలీసులతో అంతకుముందు ఏర్పాటు చేసిన సిట్‌ను మార్చేశారు. ఫలానా వ్యక్తులపై తనకు అనుమానం ఉందని సునీత జాబితా రాసిస్తే... బాధితురాలైన ఆమె, ఆమె భర్తపైనే అనుమానం వ్యక్తంచేస్తూ మాట్లాడటం, ఆ తర్వాత నుంచి ఆమెను కలిసేందుకూ నిరాకరించటం వంటి పరిణామాల్ని గమనించిన జనం ఓటు ద్వారా వేటేశారు. 

ఏకంగా సీబీఐనే వేధించారు... 

కేసు దర్యాప్తులో సీబీఐ ఒక్కో తీగను లాగుతూ వస్తున్నకొద్దీ ఆ సంస్థను అనేక రకాలుగా వేధించటం, ఏకంగా దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పైనే కేసు పెట్టటం వంటివి జగేన్‌ నైజాన్ని కళ్లకు కట్టాయి. అవినాష్‌రెడ్డిని సీబీఐ అనుమానితుడిగా గుర్తించగానే ఒక కన్ను మరో కంటిని పొడుచుకుంటుందా? అంటూ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇస్తూ, దర్యాప్తును ప్రభావితం చేసేలా జగన్‌ అసెంబ్లీలో మాట్లాడటం, ఆయన కోటరీలో అత్యంత కీలకవ్యక్తి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి మరీ సీబీఐపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, అవినాష్‌రెడ్డిని సమర్థించుకుని రావడంతో వారి స్వభావం జనాలకు మరింతగా అర్థమైంది. అవినాష్‌ నిందితుడని తేలాక పదేపదే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయిస్తూ న్యాయపరమైన చిక్కులు కల్పించారు. వాటిని దాటుకుని ఆయన్ని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లగా... జగన్‌ ప్రభుత్వం వారికి సహాయ నిరాకరణ చేసి ముప్పుతిప్పలు పెట్టింది. అవినాష్‌ ఉన్న ఆసుపత్రి ప్రాంగణం దరిదాపుల్లోకి కూడా సీబీఐ అధికారులను రానీయకుండా వైకాపా కార్యకర్తలు రోజుల తరబడి మోహరించి దౌర్జన్యం చేస్తుంటే ఖాళీ చేయించలేదు సరికదా.. ప్రభుత్వమే వారికి బందోబస్తు కల్పించడం వంటివి ప్రభావం చూపి... జగన్‌ ఓటమికి కారణమయ్యాయి. 


ప్రజాకోర్టులో శిక్షిద్దామంటూ విస్తృత ప్రచారం 

హంతకులకు ఓటేయొద్దని, వారిని కాపాడుతున్న తమ అన్నకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం ఇవ్వొద్దని వివేకా కుమార్తె సునీత, జగన్‌ సోదరి షర్మిల విస్తృతంగా ప్రచారం చేశారు. ‘‘వివేకా హంతకుల్ని రక్షిస్తున్న జగన్‌ను ప్రజాకోర్టులో శిక్షిద్దాం. వైకాపా పునాదులు రక్తంతో తడిసిపోయాయి. వివేకాను చంపిన వాళ్లకు ఓటు ద్వారా బుద్ధి చెబుదాం. గత ఎన్నికల సమయంలో జగన్‌ నన్ను తోలుబొమ్మలా ఆడించారు. అప్పట్లో ఆయన్ను అంత గుడ్డిగా నమ్మా. ఇప్పుడు వాస్తవాలు గ్రహించి నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటున్నా’’ అంటూ సునీత చెప్పిన మాటలు జనాలపై బాగా ప్రభావం చూపించాయి. ‘‘హూ కిల్డ్‌ బాబాయ్‌? గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిందెవరు?’’ అంటూ ప్రతిపక్ష పార్టీలు సంధించిన ప్రశ్నలూ ఆలోచన రేకెత్తించాయి. సీబీఐ అభియోగపత్రంలోని అంశాల ఆధారంగా రూపొందిన ‘‘వివేకం’’ చిత్రం ఈ హత్య జరిగిన తీరును, సూత్రధారులు, పాత్రధారులను జనంలోకి తీసుకెళ్లింది. దాంతో సొంత కుటుంబ సభ్యుల్నే మట్టుబెట్టిన వారు పాలకులుగా ఉండకూడదనే నిర్ణయానికి వచ్చిన ప్రజలు జగన్‌పై వేటేశారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని