PM Modi: ఇప్పటి వరకు చూసింది ట్రైలర్ మాత్రమే: మోదీ

రానున్న ఐదేళ్లలో దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేందుకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ (PM modi) అన్నారు. మేరట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

Published : 31 Mar 2024 18:04 IST

మేరట్‌: గత పదేళ్లలో ట్రైలర్‌ మాత్రమే చూశారని, అసలు అభివృద్ధి ముందుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. రానున్న ఐదేళ్లలో దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేందుకు భాజపా (BJP) రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసిందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల (LokSabha Elections) ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttar Pradesh) మేరట్‌లో ప్రధాని పర్యటించారు. ముచ్చటగా మూడోసారి భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేరట్‌ విప్లవాల గడ్డ అని, విప్లవకారులకు పుట్టినిల్లని అన్నారు. చౌదరి చరణ్‌సింగ్‌ లాంటి ఎందరో నాయకులను దేశానికి అందించిన మహమాన్వితమైన నేల మేరట్‌ అని కొనియాడారు.

2024 లోక్‌సభ ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు కోసం జరుగుతున్నవి కాదని, ‘ వికసిత్‌ భారత్’ నిర్మాణం కోసం జరుగుతున్నవని మోదీ అన్నారు. భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పుడే.. పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని, మధ్య తరగతి ప్రజలకు బలం చేకూరుతుందని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నందుకు ప్రభుత్వంపై కొందరు గుర్రుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తాను అవినీతికిపై పోరాడుతున్నందునే చాలా మంది అవినీతిపరులు కటకటాల వెనుక ఉన్నారన్నారు. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలకు వెనకాడే ప్రసక్తే లేదని మోదీ పునరుద్ఘాటించారు. రైతులను చిన్నచూపు చూసే ఇండియా కూటమి పార్టీలు... చౌదరి చరణ్‌ సింగ్‌ లాంటి నేతలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని విమర్శించారు. పేదరికంలో పుట్టి, పెరిగిన తనకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసని, అందుకే ఎవరూ పేదరికంతో బాధపడకుండా.. ప్రతి ఒక్కరికీ  పథకాలు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు భాజపా కృషి చేస్తుందన్నారు. తాజా ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని