Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ పేరు.. సీడబ్ల్యూసీ తీర్మానం

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శనివారం తీర్మానం చేసింది.

Published : 08 Jun 2024 16:03 IST

దిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా కూటమి (INDIA Bloc)’కి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ.. గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఈ బాధ్యత తీసుకోవాలని పార్టీ నేతలు బలంగా కోరుతున్నారు. శనివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ పార్టీ (CWC) సమావేశం జరగ్గా..  సీనియర్‌ నేతలు దీనిపై సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం లోక్‌సభ (Lok Sabha)లో ప్రతిపక్ష నేతగా (Leader of Opposition) రాహుల్‌ గాంధీ పేరును ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈమేరకు పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. ప్రతిపక్ష నేత బాధ్యతలు అందుకోవాలని రాహుల్‌ను ముక్తకంఠంతో కోరినట్లు చెప్పారు. దీనిపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్‌ (Congress)కు ప్రతిపక్ష హోదా దక్కడం ఇదే తొలిసారి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి విపక్ష పాత్ర పోషించేందుకు అవసరమైన సంఖ్యాబలం (లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 10శాతం) లేదు. 2019లో కాంగ్రెస్‌ 52 స్థానాల్లో గెలవగా.. అంతకుముందు 2014లో 44 సీట్లతో సరిపెట్టుకుంది.

వయనాడ్‌/రాయ్‌బరేలీపై త్వరలోనే నిర్ణయం..

ఇక ఈ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) వయనాడ్‌ (కేరళ)తో పాటు తమ కుటుంబ కంచుకోట రాయ్‌బరేలీ (యూపీ)లోనూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు స్థానాల్లో దేన్ని వదులుకుంటారనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయం గురించి కాంగ్రెస్‌ నేత వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఈనెల 17లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాయ్‌బరేలీని వదులుకుని.. ఉప ఎన్నికల్లో అక్కడినుంచి సోదరి ప్రియాంకాగాంధీ వాద్రాను పోటీకి దించే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు