YSRCP: వైకాపాలో భగ్గుమన్న అసమ్మతి.. ఆమంచికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ

వైకాపాలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. జగన్‌ ముద్దు.. ఆమంచి వద్దు అంటూ వైకాపా అసమ్మతి నేతలు నిరసన గళమెత్తి ఆమంచి కృష్ణమోహన్‌ వైఖరిపై నిప్పులు చెరిగారు.

Published : 28 Nov 2023 18:52 IST

చినగంజాం: బాపట్ల జిల్లా (Bapatla) చినగంజాం మండలం వైకాపాలో (YSRCP) అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. జగన్‌ ముద్దు.. ఆమంచి వద్దు అంటూ వైకాపా అసమ్మతి నేతలు నిరసన గళమెత్తి ఆమంచి కృష్ణమోహన్‌ (Amanchi Krishna Mohan) వైఖరిపై నిప్పులు చెరిగారు. భారీ ర్యాలీ చేసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చినగంజాం ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి, దగ్గుబాడు సర్పంచి గేరా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మోటుపల్లి సాంబశివరావు, కొత్తపాలెం సర్పంచి, మండల సర్పంచిల సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, జడ్పీటీసీ అసోది భాగ్యలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చినగంజాం ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి మాట్లాడుతూ.. పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ ఒంటెద్దు పోకడలు పోతున్నారని, ప్రజాప్రతినిధులను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో వైకాపా గాలి వీచినా.. చిన్న నియోజకవర్గమైన చీరాలలో ఓడిపోయారన్నారు. సీఎం జగన్‌ పంపించారని చూస్తుంటే.. ఆమంచి తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఆమంచి బెదిరింపులకు బెదిరిపోయేవారు లేరని తేల్చి చెప్పారు. స్థాయిని మరిచి, జిల్లాలో పార్టీ పెద్దగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని సైతం దర్భాషలాడటం సరికాదని హెచ్చరించారు. ఆమంచికి పార్టీ ఇన్‌ఛార్జి పదవి తీసేస్తే ఎందుకూ పనికిరాడన్నారు. దగ్గుబాడు సర్పంచ్ గేరా రవీంద్రనాథ్‌ ఠాగూర్ మాట్లాడుతూ.. పర్చూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఆమంచి కృష్ణమోహన్ అరాచకాలు చేస్తున్నారని, చెరువులు ఆక్రమించి రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే పర్చూరు నియోజకవర్గానికి ఆమంచి కృష్ణమోహన్ నుంచి విముక్తి కలుగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని