KTR: డీకే శివకుమార్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

వికారాబాద్‌లో కాంగ్రెస్‌ రోడ్‌ షో సందర్భంగా భారాసపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ చేసిన విమర్శలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

Updated : 29 Oct 2023 13:17 IST

హైదరాబాద్: కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నిర్వహించిన రోడ్‌షోల్లో భారాసపై డీకే చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. తమ రాష్ట్రానికి వస్తే పథకాల అమలు చూపిస్తామంటూ డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందించారు. డీకే గారూ.. కాంగ్రెస్‌కు అధికారమిస్తే అంధకారమేనని కర్ణాటక దుస్థితిని చూసిన తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు.

అది మీ చేతగానితనానికి నిదర్శనం

‘‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న మా రాష్ట్రానికి వచ్చి.. కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది మీ చేతకానితనానికి నిదర్శనం. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా.. తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా?మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే.. ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు.

రండి మా రాష్ట్రానికి.. పథకాల అమలును చూపిస్తాం

చీకటి రాజ్యంగా కర్ణాటక

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఎన్నికల ప్రచారంలో ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు.. ఛార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయింది. కనీసం ఐదుగంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతాంగమే కాదు.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్‌లతో వాణిజ్య, వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మీ అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కింది. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన మీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు. రేషన్‌పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది. 

తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డా..

మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి కర్ణాటక ఆర్టీసీని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారింది. మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న మీ గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టింది. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న ప్రధాని హామీలాగే మీ హామీ కూడా గంగలో కలిసిపోయింది. కర్ణాటకలో  అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు తెర తీసిన కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతోంది. అక్కడ సకల రంగాల్లో సంక్షోభానికి తెరతీసిన ఆ పార్టీని నమ్మి మోసపోవడానికి మా ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డా’’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని