రండి మా రాష్ట్రానికి.. పథకాల అమలును చూపిస్తాం

కర్ణాటకలో అధికారంలోకి రాగానే అయిదు హామీలను అమలు చేశామని, తెలంగాణలోనూ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ స్పష్టం చేశారు.

Updated : 29 Oct 2023 05:28 IST

కేటీఆర్‌ సహా మంత్రులంతా రావాలని కోరిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌
తెలంగాణలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ

తాండూరు, పరిగి, చేవెళ్ల, న్యూస్‌టుడే: కర్ణాటకలో అధికారంలోకి రాగానే అయిదు హామీలను అమలు చేశామని, తెలంగాణలోనూ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వీటి అమలుపై తొలి సంతకం చేస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు పదేళ్లు అధికారం ఇచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారని, తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా అమలు చేసితీరుతామని ప్రకటించారు. పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి డిసెంబరు 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రకటన చేశారని.. ఇప్పుడు అదే తేదీన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వికారాబాద్‌ జిల్లా తాండూరు, పరిగి, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయభేరి యాత్ర రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో తమ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని సీఎం కేసీఆర్‌ విమర్శిస్తున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌, మిగిలిన మంత్రులు వస్తే బస్సు ఏర్పాటు చేస్తామని, వారికి పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో చూపిస్తామని చెప్పారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజలు కూడా అధికారంలోకి వచ్చినట్లేనని పేర్కొన్నారు. తెలంగాణలో హస్తం హవా కొనసాగుతుందన్న పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు. భారాస పాలన అధ్వానంగా, అవినీతిమయంగా ఉందని ఆరోపించారు.

ఓటమిని ఒప్పేసుకున్న కేసీఆర్‌: రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో భారాస ఓడిపోతుందని సీఎం కేసీఆర్‌ ఒప్పేసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఓడిపోతే మాకేం కాదు.. మీకే నష్టమంటూ అచ్చంపేట సభలో కేసీఆర్‌ వ్యాఖ్యానించడం అపజయాన్ని అంగీకరించినట్లేనన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్‌ స్వాహా చేసిన సొమ్ము కక్కిస్తామని, ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు వట్టిమాటేనని, ఉప కేంద్రాలకు వెళ్లి అడిగితే 8 నుంచి 9 గంటల మాత్రమే ఇస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పి మోసం చేసిన కేసీఆర్‌ వెంట ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ వెళ్లడం దారుణమన్నారు.

కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ ఉండేచోట కేసీఆర్‌ పోటీకి అసదుద్దీన్‌ మద్దతు తెలుపుతారని, గోషామహల్‌లో రాజాసింగ్‌ పోటీచేసే చోట స్పందించరని విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచి పార్టీ ఫిరాయించిన 16 మందిని ఈసారి చిత్తుగా ఓడిస్తామని చెప్పారు. వైఎస్సార్‌ చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి 2004లో పార్టీని అధికారంలోకి తెచ్చారని.. ఈసారి కూడా చేవెళ్ల సెంటిమెంటును కొనసాగించాలని కార్యకర్తలను కోరారు. చేవెళ్ల టికెట్‌ను మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు ఇవ్వాలనుకున్నామని, స్థానికులకే ఇవ్వాలన్న డిమాండ్‌ మేరకు భీంభరత్‌కు అధిష్ఠానం కేటాయించిందని తెలిపారు. తాండూరు, పరిగి అభ్యర్థులు బుయ్యని మనోహర్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్‌, కొండ్రు పుష్పలీల, పీసీసీ ప్రధాన కార్యదర్శులు ధారాసింగ్‌, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని