Eatala Rajender: కేసీఆర్ ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా నిజాలు ఉండట్లేదు: ఈటల

అసెంబ్లీ సాక్షిగా గెస్ట్ లెక్చరర్స్‌కు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

Updated : 25 Jul 2023 17:38 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడటం లేదని హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా గెస్ట్ లెక్చరర్స్‌కు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ముట్టడికి యత్నించిన గెస్ట్ లెక్చరర్స్‌ అరెస్టుపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. అరెస్టు అయిన అతిథి అధ్యాపకులను ముషీరాబాద్‌ పీఎస్‌లో పరామర్శించిన ఈటల.. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అరెస్టు చేసిన గెస్ట్ లెక్చరర్స్‌ను తక్షణమే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.

అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పదేళ్ల నుంచి గెస్ట్ లెక్చరర్స్‌గా పని చేస్తున్న తమను రెన్యువల్ చేయాలని వారు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పును కూడా సీఎం పట్టించుకోవడం లేదు. సెలవులు వస్తే వారికి జీతాలు రావు. వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలి. కేసీఆర్‌ను ప్రశ్నించినా.. అడ్డుకున్నా సహించరు. కేసీఆర్ భూముల మీద కన్నేశారు. వీఆర్ఏలు సమ్మె చేస్తే ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు వీఆర్ఏ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్‌ పీరియడ్ మూడేళ్లు పెట్టిన కేసీఆర్.. మరో సంవత్సరం పెంచి నాలుగేళ్లు చేయడం దుర్మార్గం. ఇప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్య పరిష్కారం కాలేదు.

తెలంగాణ ప్రజలు ప్రేమకు లోంగుతారు తప్పితే దబాయింపులకు కాదు. ఉద్యోగులను పెట్టిన హింసకు ప్రతీకారం తీర్చుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తే వచ్చే పంట కన్నా కరెంట్ బిల్లు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. కౌలు రైతుల సమస్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి. రైతుబంధు పేరుతో అన్ని రాయితీలను ఎత్తి వేశారు’’ అని ఈటల మండిపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని