EC: ఎన్నికల వేళ రాష్ట్రాల్లో ప్రత్యేక పరిశీలనాధికారులను నియమించిన ఈసీ

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వివిధ రాష్ట్రాలలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ఆపేందుకు ఎన్నికల సంఘం (EC) ప్రత్యేక ఎన్నికల పరిశీలనాధికారులను మంగళవారం నియమించింది. 

Published : 02 Apr 2024 18:51 IST

దిల్లీ : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వివిధ రాష్ట్రాలలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ఆపేందుకు ఎన్నికల సంఘం (EC) ప్రత్యేక ఎన్నికల పరిశీలనాధికారులను మంగళవారం నియమించింది. ఈ స్థానాల్లో మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఈసీ ప్రకటించింది. వీరు వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రక్రియలపై నిఘా ఉంచుతారు. ఎన్నికల్లో నగదు తరలింపు, అధికార దుర్వినియోగం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వంటివాటిపై ప్రత్యేక అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని ఈసీ తెలియజేసింది.

ఏడు కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌లో జనరల్, పోలీసు విభాగాలకు చెందిన ప్రత్యేక పరిశీలనాధికారులను ఈసీ రంగంలోకి దింపింది. అలాగే ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశాలో సైతం అధికారులను నియమించామని ఎన్నికల అధికారి తెలిపారు. వీరు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యాలయాలలో విధులు నిర్వహిస్తూ, అల్లర్లకు ఆస్కారముండే సున్నిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్నికల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారని ఆయన పేర్కొన్నారు. వీరు వివిధ అసెంబ్లీ స్థానాలు, జిల్లాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఎన్నికల అధికారులు, నోడల్‌ అధికారుల నుంచి సమాచారం సేకరించి భద్రతా ప్రమాణాల్లో లోపాలను పర్యవేక్షిస్తారని వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లోని టోల్‌గేట్ల వద్ద వాహనాల తనిఖీలపై నిఘా ఉంచుతారన్నారు. వీరు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన, తాయిళాల పంపకాలు, తప్పుడు సమాచారాల వ్యాప్తి మొదలైన వాటిపై ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించి ఈసీకి అందించనున్నారు. నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించడానికి పోలింగ్‌కు 72 గంటల ముందు పరిశీలనాధికారులు పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షిస్తారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలను పర్యవేక్షించేందుకు సాధారణ ప్రత్యేక పరిశీలకుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రా, పోలీసు ప్రత్యేక పరిశీలకుడిగా మాజీ ఐపీఎస్ దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 మధ్య ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని