Rajeev Chandrasekhar: మంత్రిగారి అఫిడవిట్‌ను ఒకసారి పరిశీలించండి : ప్రత్యక్ష పన్నుల బోర్డును కోరిన ఈసీ

కేంద్ర మంత్రి రాజీవ్‌ ఆస్తుల అఫిడవిట్‌పై ఎన్నికల సంఘం స్పందించింది. దీనిని పరిశీలించాలని ప్రత్యక్ష పన్నుల విభాగాన్ని కోరింది.

Published : 09 Apr 2024 16:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekhar) దాఖలు చేసిన అఫిడవిట్‌ ఆశ్చర్యకరంగా ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో మంత్రి అందజేసిన సమాచారంలో నిజానిజాలెంతో తెలుసుకోవాలని ప్రత్యక్ష పన్నుల బోర్డును ఈసీ కోరింది. 

ఇటీవల భాజపా కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌పై పోటీకి కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ను రంగంలోకి దింపింది. దీంతో ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. దీనిలో 2021-2022లో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం కేవలం రూ.680గా మాత్రమే చూపించారు. ఈ లెక్కలపై కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆర్థిక సమాచారం అందించారని ఆరోపించింది. ఇది 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘనగా అభివర్ణించింది.  

ఈ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. మంత్రి డిక్లరేషన్‌ను సీబీడీటీ పరిశీలించాలని కోరింది. నిబంధనల ప్రకారం అభ్యర్థులు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, స్థిర, చర ఆస్తులను, అప్పులను వెల్లడించాలి. దీంతోపాటు జీవిత భాగస్వామి ఆర్థిక వనరులను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. 

మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌ తనకు రూ.55 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన వార్షికాదాయం రూ.4.32 కోట్లకుపైగా అని వెల్లడించారు. అమెరికాలోని టఫ్స్‌ విశ్వవిద్యాలయంలో లా, డిప్లమసీలో పీహెచ్‌డీ, ప్యూజెట్‌ సౌండ్‌ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ వ్యవహారాల్లో డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ను విద్యార్హతలుగా తెలిపారు. తనపై దేశవ్యాప్తంగా తొమ్మిది కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో రూ.23 కోట్ల ఆస్తిని చూపగా, 2019 ఎన్నికల్లో రూ.35కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. 

ఇక రాజీవ్‌-థరూర్‌ ఇద్దరూ తిరువనంతపురంలో నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమయ్యారు. దీనికి వేదిక ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు