Harish Rao: హైదరాబాద్‌ పక్కా తెలంగాణ రాజధాని

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాదని, ఇకపై ఇది పక్కా తెలంగాణ రాజధాని అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు పేర్కొన్నారు.

Published : 25 May 2024 05:09 IST

మాజీ మంత్రి హరీశ్‌రావు

పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు. వేదికపై సండ్ర వెంకటవీరయ్య,
రాకేశ్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, ప్రవీణ్‌కుమార్, తాతా మధుసూదన్‌ తదితరులు

సత్తుపల్లి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాదని, ఇకపై ఇది పక్కా తెలంగాణ రాజధాని అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. భారాస పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలంటూ శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణ అవతరించి జూన్‌ 2వ తేదీతో పదేళ్లు పూర్తవుతుందన్నారు. కేసీఆర్‌ వద్దన్నా కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిందని, ఇప్పుడు మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌నే కొనసాగించేందుకు కాంగ్రెస్‌ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌ను లూటీ చేయాలని భాజపా, కాంగ్రెస్‌లు కుట్రలు పన్నుతున్నాయని, హైదరాబాద్‌ లేకుంటే జిల్లాలు అభివృద్ధి చెందవన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, భారాస నేతలు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్, సుదర్శన్‌ పాల్గొన్నారు. 


‘టిమ్స్‌’పై కోమటిరెడ్డిది అవగాహన లేమి

ఈనాడు, హైదరాబాద్‌: భారాస ప్రభుత్వం హయాంలో తలపెట్టిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని, వాటిపై మంత్రికి కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరమని హరీశ్‌రావు విమర్శించారు. దీనిపై ఆయన శుక్రవారం ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘ఐదు నెలలుగా టిమ్స్‌ నిర్మాణాలు, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. లేనిపోని ఆరోపణలు చేస్తోంది. ఎల్బీనగర్‌లో టిమ్స్‌ నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే. అయితే 27 అంతస్తులని మంత్రి కోమటిరెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం. ఎక్కువ అంతస్తులుంటే రోగులు ఇబ్బంది పడతారని మొసలి కన్నీరు కార్చుతున్న మంత్రికి.. జైపుర్‌లో నాటి రాజస్థాన్‌ కాంగ్రెస్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ చేపట్టిన 24 అంతస్తుల ఆస్పత్రి ఎందుకు కనిపించడం లేదు?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు