Exit Polls: 2019లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయ్‌?

Exit Polls: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కొన్నిసార్లు వాస్తవ ఫలితాలకు దగ్గరగా వస్తుంటాయి. మరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంచనాలు ఎలా ఉన్నాయ్‌?

Published : 29 May 2024 18:56 IST

Exit Polls | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల సమయంలో వివిధ మీడియా/ ప్రైవేటు సంస్థలు వెలువరించే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై (Exit Polls) ప్రజలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. కొన్నిసార్లు ఈ అంచనాలు నిజమవుతుంటాయి. మరికొన్నిసార్లు బోల్తా కొడుతుంటాయి. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం దాదాపు అన్ని సర్వే సంస్థలు దేశంలో ఎన్డీయేదే మరోసారి అధికారం అని ఘంటాపథంగా తేల్చిచెప్పాయి. సీట్ల సంఖ్యలో అంచనాలు వేరుగా ఉన్నప్పటికీ.. మరోసారి ప్రధాని మోదీనే అధికార పగ్గాలు చేపడతారని తేల్చిచెప్పాయి.

2019లో కూడా ఇప్పటిలానే ఏడు విడతల్లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఎన్నికల్లో భాజపాకు సొంతంగా 303 లోక్‌సభ సీట్లు రాగా.. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 353 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి 52 సీట్లు రాగా.. యూపీఏ కూటమికి 91 సీట్లు మాత్రమే వచ్చాయి. ఏ కూటమితో సంబంధం లేని పార్టీలు 98 స్థానాలు దక్కించుకున్నాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చూసుకుంటే.. ఎన్డీయే కూటమికి కనిష్ఠంగా 242 సీట్లు, గరిష్ఠంగా 352 సీట్లు వస్తాయని వివిధ సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇండియాటుడే- యాక్సిస్‌, న్యూస్‌ 24 - టుడేస్‌ చాణక్య వంటి సంస్థలు ఫలితాలకు దగ్గరగా తమ అంచనాలను వెలువరించాయి. మిగిలిన సంస్థలు అంచనాల్లో కాస్త తడబడ్డాయి. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత అంతగా లేకపోవడం, జాతీయవాద అంశాలు తెరపైకి రావడం అప్పట్లో భాజపాకు కలిసొచ్చింది.

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సర్వే సంస్థలు తెదేపా వైపు, మరికొన్ని వైకాపా వైపు మొగ్గు చూపాయి. కానీ అనూహ్యంగా ఆ ఎన్నికల్లో వైకాపా భారీ విజయం సాధించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో తెరాసకు 12 స్థానాలు వస్తాయని మెజారిటీ సర్వే సంస్థలు అంచనాలు వెలువరించగా.. ఆ పార్టీ 9కే పరిమితమైంది. కాంగ్రెస్ 3, భాజపా 4 స్థానాల్లో గెలుపొందాయి. మజ్లిస్‌ తన స్థానాన్ని పదిలపరుచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని