Sanjay Raut: గడ్కరీని భాజపా అగ్రనేతలే ఓడించాలనుకున్నారు.. సంజయ్‌ రౌత్‌ సంచలన ఆరోపణలు!

Sanjay Raut: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ఓడించేందుకు సొంత పార్టీ అయిన భాజపాలోని కీలక నేతలే పనిచేశారని శివసేన యూబీటీ వర్గం నేత సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు.

Published : 26 May 2024 14:29 IST

ముంబయి: భాజపా అగ్రనేతలపై శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని (Nitin Gadkari) నాగ్‌పూర్‌లో ఓడించేందుకు ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కలిసి పనిచేశారని ఆరోపించారు. గడ్కరీని ఓడించడం సాధ్యం కాదని తెలియటంతో చివర్లో ఫడణవీస్‌ అయిష్టంగానే ప్రచారంలో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్‌ వర్గాలు బహిరంగంగా చర్చించుకుంటున్నాయని పార్టీ పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో రౌత్‌ పేర్కొన్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఒక్కో నియోజకవర్గంలో రూ.25-30 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఆయన యంత్రాంగం మొత్తం డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థులను ఓడించేందుకు పనిచేసిందన్నారు. ప్రస్తుతం అజిత్‌ పవార్‌ ఆధ్వర్యంలో ఎన్సీపీ వర్గం శిందే ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు భాజపా (BJP) తిరిగి అధికారంలోకి వస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పదవి నుంచి తప్పిస్తారని రౌత్‌ ఆరోపించారు.

సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) ఆరోపణలను భాజపా (BJP) తిప్పికొట్టింది. భాజపా ఒక పార్టీ కాదని.. ఒక కుటుంబం అని ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాంకులే అన్నారు. మోదీ, షా, యోగి ఆదిత్యనాథ్‌, గడ్కరీ వీరంతా కుటుంబ సభ్యుల్లాంటి వారని వ్యాఖ్యానించారు. తమ తొలి ప్రాధాన్యం దేశ ప్రయోజనాలని.. తర్వాతే మిగిలనవన్నీ అని పేర్కొన్నారు. రౌత్‌కు ధైర్యముంటే 2019లో సీఎం కావడానికి ఆయన చేసిన యత్నాలపైన వ్యాసం రాయాలని సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని