Kumaraswamy: చక్కెర నాడు తీపి.. కుమారకా? చంద్రుడికా..?

Mandya: కర్ణాటకలోని మండ్య పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇక్కడ బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్‌ నుంచి వెంకటరమణ గౌడ పోటీ చేస్తున్నారు.

Updated : 13 Apr 2024 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మండ్య (Mandya).. కర్ణాటకలోని కావేరీ తీరంలో గల ఈ లోక్‌సభ (Lok sabha elections) నియోజకవర్గంలో ఈసారి రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. వక్కలిగల అడ్డాగా పేరున్న ఈ ప్రాంతంలో తిరిగి తమ ఆధిపత్యాన్ని దక్కించుకునేందుకు స్వయంగా జేడీఎస్‌ (JDS) నేత కుమారస్వామి (Kumaraswamy)యే ఇక్కడ రంగంలోకి దిగారు. ఆయనను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ (Congress) ‘స్టార్‌ చంద్రు’గా పేరున్న ప్రముఖ కాంట్రాక్టర్‌ వెంకటరమణ గౌడను నిలబెట్టింది. దీంతో స్థానిక, స్థానికేతర పోరుతో ‘చక్కెరనాడు’ ఎన్నిక ఆసక్తి రేకెత్తిస్తోంది.

సుమలతను తప్పించి మరీ..

ఈ నియోజకవర్గం బెంగళూరు, మైసూరు మధ్యలో ఉంది. పాత మైసూరు ప్రాంతంలో వక్కలిగ రాజకీయాలకు కీలకమైన ఈ స్థానంలో కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్యే ప్రధాన పోటీ నడుస్తున్నా ఆధిపత్యం దళపతులదే. అయితే, 2019ల్లో దీన్ని పటాపంచలు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి, నటి సుమలత ఇక్కడ విజయం సాధించడంతో జేడీఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ ఎన్నికల్లో తన కుమారుడు నిఖిల్‌గౌడను రాజకీయ అరంగేట్రం చేయించి అబాసుపాలైన కుమారస్వామి ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు.

కోల్పోయిన చోటే ఆధిపత్యాన్ని తిరిగి దక్కించుకునేందుకు తీవ్రంగా యత్నించారు. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్న జేడీఎస్‌ సీట్ల సర్దుబాటులో భాగంగా మండ్య స్థానం కోసం విపరీతంగా పట్టుబట్టింది. ఇందుకు అంగీకరించిన కమలదళం.. సుమలతకు సర్దిచెప్పి ఆమెను పోటీ నుంచి తప్పించింది. ఫలితంగా భాజపా-జేడీఎస్‌ కూటమి అభ్యర్థిగా కుమారస్వామి నామినేషన్‌ వేశారు.

మాజీ సీఎం ఎంట్రీతో మారిన వ్యూహం..

వాస్తవానికి తొలుత మండ్యలో కాంగ్రెస్‌ కాస్త వెనకడుగు వేసినట్లే కన్పించింది. కానీ, కుమారస్వామి ఎంట్రీతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. దీంతో హస్తం పార్టీ కూడా తమ వ్యూహాలకు పదునుపెట్టింది. ఇందులో భాగంగానే స్థానికంగా మంచి పేరున్న వెంకటరమణను బరిలోకి దించింది. ఈయన స్వతంత్ర ఎమ్మెల్యే కేహెచ్‌ పుట్టస్వామి గౌడ సోదరుడు కావడంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు.

పార్టీల బలాబలాలు ఇలా..

కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉన్నప్పటికీ.. ఇటీవలకాలంలో భాజపా కూడా బలపడుతోంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతకు భాజపా వెలుపలి నుంచి మద్దతు ప్రకటించింది. ఇక, కుమారస్వామి హసన్‌ జిల్లాకు చెందిన వ్యక్తే అయినప్పటికీ వక్కలిగలో మద్దతుతో మండ్యను దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో భాజపాతో పొత్తు, మోదీ పాపులారిటీ ఆయనకు కలిసొచ్చే అంశం.

అటు కాంగ్రెస్‌ ‘స్థానిక’ మంత్రంతో ఓట్లను ఆకర్షించేందుకు యత్నిస్తోంది. మరోవైపు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కూడా వక్కలిగ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన విరివిగా ప్రచారం చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వకపోవడంతో ఈ ప్రాంతంలో హస్తానికి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అటు కరవు పరిస్థితుల్లోనూ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడం కూడా ప్రతికూలంగా మారింది.

గత ఎన్నికల్లో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థిగా నిఖిల్‌ పోటీ చేయగా.. ఆయనపై సుమలత 1.15 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మండ్య నియోజక వర్గ పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్‌ ఆరు చోట్ల ప్రాతినిధ్యం వహిస్తుండగా.. జేడీఎస్‌, సర్వోదయ కర్ణాటక పక్ష పార్టీలకు చెరో స్థానం దక్కింది. కాంగ్రెస్‌ నుంచి ఓ మంత్రితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు.

రెండో విడతలో భాగంగా ఏప్రిల్‌ 26 మండ్య నియోజకవర్గానికి పోలింగ్‌ జరగనుంది. మండ్యలో చెరకు సాగు, చక్కెర పరిశ్రమలు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం ‘చక్కెరనాడు’గా పేరొందింది. మరి రాబోయే ఎన్నికల్లో ‘గెలుపు తీపి’ కుమారకా? చంద్రుడికా? అన్నది తెలియాలంటే జూన్‌ 4వ తేదీ వరకు ఆగాల్సిందే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు