Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్‌ ఆసక్తికర పోస్ట్‌

Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌. దీనిపై ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Published : 18 May 2024 12:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసిన ఆమె.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారం (Political Campaign) కోసం పడుతున్న కష్టం ముందు సినిమా కష్టాలు చాలా చిన్నవని అభిప్రాయపడ్డారు.

‘‘వరుసగా ఆరు ప్రజా సభలు, పార్టీ కార్యకర్తలతో పలుమార్లు సమావేశాలు.. పర్వత ప్రాంతాల్లో కష్టమైన రహదారులపై ఒక్క రోజే 450 కిలోమీటర్ల ప్రయాణం.. నిద్రలేని రాత్రులు.. సమయానికి తీసుకోని భోజనం.. ఇవన్నీ చూసిన తర్వాత నాకో విషయం అర్థమైంది. ఈ క్లిష్టమైన పోరాటం ముందు సినిమా తీయడానికి పడే కష్టాలు ఓ జోక్ లాంటివే’’ అని కంగన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఈ ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేసిన కంగన.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం (Mandi Lok sabha Seat) నుంచి భాజపా (BJP) తరఫున పోటీ చేస్తున్నారు. చివరి దశలో భాగంగా ఈ స్థానానికి జూన్‌ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 14వ తేదీన ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మండి నుంచి పోటీ చేసే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా. నేను బాలీవుడ్‌లో విజయం సాధించాను. రాజకీయ రంగంలోనూ రాణిస్తానని విశ్వాసంగా ఉన్నా’’ అని అన్నారు.

ఇదిలా ఉండగా.. కంగన నటించిన తాజా చిత్రం  ‘ఎమర్జెన్సీ’ (Emergency) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం నటి బిజీగా ఉండటంతోనే సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ సినిమా కంగన స్వీయ దర్శకత్వంలో రూపొందుతోంది. స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగన.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని