Lok Sabha Elections: యూపీఏ హయాంలో పదేళ్లు ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్‌!

‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులు ఉంటారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మల్లికార్జున ఖర్గే తాజాగా తిప్పికొట్టారు.

Published : 21 May 2024 23:39 IST

చండీగఢ్‌: ఒకవేళ ‘ఇండియా’ కూటమి (INDIA Bloc) అధికారంలోకి వస్తే అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులు ఉండేలా ప్రణాళికలు రచిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వరుస ఆరోపణలు చేస్తోన్న తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తిప్పికొట్టారు. 2004కు ముందుసైతం ఇదే విధంగా మాట్లాడారని.. అయితే, పదేళ్ల యూపీఏ పాలనలో మన్మోహన్‌సింగ్‌ ఒక్కరే ప్రధానిగా ఉన్నారని గుర్తుచేశారు. ఆయన నేతృత్వంలోనే రెండు పర్యాయాలు పూర్తి చేసినట్లు చెప్పారు. హరియాణాలో లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారానికి వచ్చిన ఖర్గే ఈ మేరకు మాట్లాడారు.

అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులు.. ‘ఇండియా’ ప్లాన్‌ ఇదే: ప్రధాని మోదీ

‘‘యూపీఏ 1, 2 హయాంలో మాకు ఇతర పార్టీలూ మద్దతు ఇచ్చాయి. పూర్తి పదేళ్లు పాలించాం. రెండు పర్యాయాలూ మన్మోహన్‌ సింగ్‌ ఒక్కరే ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తన పాలనా సామర్థ్యంతో దేశ ఆర్థిక గతినే మార్చేశారు’’ అని ఖర్గే పేర్కొన్నారు. భాజపా మాత్రం తన పదేళ్ల పాలనలో ఏమీ చేయలేదని విమర్శించారు. ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరంటూ అధికారం పక్షం లేవనెత్తుతోన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఎన్నికల తర్వాత కూటమి నేతలంతా సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2004 ఎన్నికల సమయంలోనూ భాజపా ఇదే విధమైన వాదనలు చేసిందని, అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని ఎలా నడిపించామో.. ఇప్పుడూ అదే పద్ధతిలో చేస్తామన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో విపక్ష కూటమి ఇప్పటికే మంచి ఆధిక్యాన్ని సంపాదించిందని, మోదీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని