icon icon icon
icon icon icon

LS Polls: అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులు.. ‘ఇండియా’ ప్లాన్‌ ఇదే: ప్రధాని మోదీ

ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులు ఉండేలా ప్రణాళికలు రచిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.

Published : 27 Apr 2024 21:52 IST

ముంబయి: కాంగ్రెస్‌ (Congress) ఆధ్వర్యంలోని ‘ఇండియా’ కూటమి (INDIA Bloc)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి విరుచుకుపడ్డారు. ఒకవేళ అధికారంలోకి వస్తే అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులు ఉండేలా ఆ కూటమి ప్రణాళికలు రచిస్తోందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ‘డూప్లికేట్‌’ శివసేన ప్రస్తుతం కాంగ్రెస్‌ పక్షాన నిలిచిందని.. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే బతికుంటే ఇదంతా చూసి బాధపడేవారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు. సామాజిక న్యాయాన్ని అంతమొందించడమే హస్తం పార్టీ, ఇండియా కూటమి లక్ష్యమని ఆరోపించారు.

ఓటు వేయలేదన్న కేంద్ర మంత్రి.. విపక్షాల విమర్శలు

‘‘ఈ ఎన్నికల్లో విపక్ష కూటమికి మూడంకెల సీట్లు కూడా రావు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ.. అవకాశం దొరికితే మాత్రం అయిదేళ్లలో ఏడాదికి ఒకరు ప్రధానిగా ఉండాలనే ఆలోచనలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ రెండున్నరేళ్ల తర్వాత సీఎంను మార్చే ప్లాన్‌ చేస్తోంది. కర్ణాటక మోడల్‌ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలుచేయాలని భావిస్తోంది. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ పార్టీ దిగజారింది. రాజ్యాంగాన్ని మార్చాలని, మతపరమైన రిజర్వేషన్ల కోసం దళితులు, ఓబీసీల కోటా ప్రయోజనాలను కాజేయాలని చూస్తోంది. సంపద పునఃపంపిణీ, వారసత్వ పన్ను ద్వారా ప్రజల సొమ్మును దోచుకోవాలని కుట్రలు పన్నుతోంది’’ అని మండిపడ్డారు.

‘2-0’తో ఎన్డీయే ముందంజలో..

లోక్‌సభ ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్‌ పూర్తయిన వేళ.. ‘2-0’ ఆధిక్యంతో ఎన్డీయే ముందంజలో ఉందని మోదీ చెప్పారు. ‘‘కొల్హాపుర్‌ను ఫుట్‌బాల్ హబ్‌గా పిలుస్తారు. ప్రస్తుతం ఎన్డీయే ‘2-0’తో ఆధిక్యంలో ఉంది. దేశ వ్యతిరేక విధానాలు, విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ కూటమి రెండుసార్లు సెల్ఫ్ గోల్స్‌ వేసుకుంది. మూడో విడతలోనూ ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పేలా ఓటర్లు మూడో గోల్‌ వేస్తారని విశ్వసిస్తున్నా. హస్తం పార్టీ మ్యానిఫెస్టోలో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని, సీఏఏను రద్దు చేస్తామని చెప్పారు. మోదీ నిర్ణయాలను ఎవరైనా మార్చగలరా? అలా చేస్తే, పరిణామాలు ఏంటో వారికి తెలుసా?’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img