Iltija mufthi: మా అమ్మను బెదిరించడానికే ఇలాంటి కేసులు : మాజీ సీఎం కుమార్తె ఇల్తిజా

పీడీపీ చీఫ్‌, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీపై కేసు నమోదు చేయడంపై ఆమె కుమార్తె మండిపడ్డారు.

Published : 29 May 2024 17:11 IST

శ్రీనగర్‌: తన తల్లిని బెదిరించడానికే కేసులు నమోదు చేస్తున్నారని పీడీపీ చీఫ్‌, కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా అన్నారు. అధికార యంత్రాంగం ఇలాంటి ఎత్తుగడలు ఎన్నివేసినా తమ పార్టీ నిజాలు చెప్పడాన్ని ఆపదన్నారు. మే 25న ఎన్నికల పోలింగ్‌ వేళ పీడీపీ కార్యకర్తలు, ఎన్నికల ఏజెంట్లను నిర్బంధించడంపై మెహబూబా నిరసన తెలపడంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. దీనిపై పీడీపీ మీడియా సలహాదారుగా ఉన్న ఇల్తిజా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్యలు తమను భయపెట్టడానికేనన్నారు. వీటికి భయపడి తాము ఎవరిముందూ మోకరిల్లబోమన్నారు. 

ఓటమి తర్వాత.. ఈవీఎంలపై నిందలే : అమిత్‌ షా

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్ జరుగుతున్నప్పుడు ముఫ్తీ రోడ్డుపై కూర్చొని నిరసన తెలపడాన్ని ప్రస్తావించిన ఇల్తిజా.. తన తల్లికి సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, ఎన్నికల ఏజెంట్ల నిర్బంధంపైనే ఆమె నిరసన తెలపాలనుకున్నారని చెప్పారు. ఒక మాజీ సీఎం వీధుల్లోకి రావాల్సివచ్చినప్పుడు.. ఇక ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడతామని ప్రశ్నించారు. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు పోలీసులు పీడీపీ కార్యకర్తలు, ఎన్నికల ఏజెంట్లను ఎత్తుకెళ్లారని.. ఆపై వారిని మిలిటెంట్లకు చెందిన ఓవర్‌ గ్రౌండ్‌వర్కర్లు (OGW)గా ముద్ర వేశారని ఆరోపించారు. 1990లో మాదిరిగానే, పోలింగ్‌కు ముందురోజు రాత్రి పోలీసులు వారిని నిర్బంధించారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని