First phase:: మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్‌.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..

First phase of LS polls: లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్‌ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

Published : 19 Apr 2024 16:38 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Lok sabha Elections) సమరంలో తొలి విడత పోలింగ్‌ (First Phase Voting) శుక్రవారం కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అల్లర్ల వంటి చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. మొదటివిడతలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 49.78శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (Election Commission) వెల్లడించింది.

అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 68.35 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత మణిపుర్‌ 63శాతం, మేఘాలయలో 61శాతం, అస్సాంలో 60శాతం మంది ఓటర్లు ఇప్పటివరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా బిహార్‌లో 39.78శాతం పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

తొలివిడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

ఆయా రాష్ట్రాల్లో తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, కొత్త జంటలు ఓటు వేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బెంగాల్‌లో కొన్నిచోట్ల టీఎంసీ, భాజపా వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మణిపుర్‌లో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పుల శబ్దాలు కలకలం సృష్టించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని