BJP: రాజకీయాలకు గుడ్‌బై.. కేంద్ర మాజీ మంత్రి ప్రకటన

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు భాజపా ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డా.హర్షవర్థన్‌ ప్రకటించారు. 

Updated : 03 Mar 2024 17:43 IST

దిల్లీ: భాజపా (BJP) ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డా.హర్షవర్థన్ (Dr. Harsh Vardhan) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)లో పోస్టు చేశారు. ఇకపై దిల్లీ కృష్ణానగర్‌లోని తన క్లినిక్‌లో వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన దిల్లీలోని చాందినీ చౌక్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. భాజపా నిన్న ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

‘‘50 ఏళ్ల క్రితం కాన్పూర్‌లోని జీఎస్‌వీఎమ్‌ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరినప్పుడు పేదలకు సాయం చేయాలనేది నా ఆశయం. ఆరెస్సెస్‌ సూచన మేరకు రాజకీయాల్లోకి వచ్చాను. దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా, కేంద్ర ఆరోగ్య మంత్రిగా నా హృదయానికి దగ్గరగా ఉన్న పని చేశాను. పోలియో రహిత భారత్‌ కోసం, కరోనా రెండు విడతల్లో దేశ ప్రజలను కాపాడేందుకు నా వంతు కృషి చేశాను. ఇన్నేళ్ల నా రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు. ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. 

ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన భాజపా.. పోటీ చేయలేనన్న సింగర్‌ పవన్‌సింగ్‌!

ఈఎన్‌టీ వైద్యుడైన డా.హర్షవర్థన్‌.. 1993లో తొలిసారి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా నగర్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అనంతరం దిల్లీ ఆరోగ్య శాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే స్థానం నుంచి ఆయన వరుసగా ఆరుసార్లు (1993, 96, 98, 2003, 2008, 2013) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మోదీ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టారు. 2021లో జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. కరోనా సమయంలో దేశంలో వైరస్‌ను కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని