Prabodh Tirkey : కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న హాకీ టీమ్‌ మాజీ కెప్టెన్

ఒడిశా (Odisha) రాష్ట్రానికి చెందిన ప్రముఖ హాకీ ప్లేయర్‌ ప్రబోధ్‌ టిర్కీ (Prabodh Tirkey) కాంగ్రెస్‌ (Congress) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

Updated : 04 Sep 2023 18:11 IST

భువనేశ్వర్‌ : ఇండియా హాకీ టీమ్‌ మాజీ కెప్టెన్ ప్రబోధ్‌ టిర్కీ (Prabodh Tirkey) కాంగ్రెస్‌ పార్టీలో (Congress) చేరారు. భువనేశ్వర్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ చల్లా కుమార్‌లు ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఏడాది జరగబోయే ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమని ఈ సందర్భంగా ప్రబోధ్‌ ప్రకటించారు. ఆదివాసీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సుందర్‌గఢ్‌ జిల్లాలోని తల్సారా అసెంబ్లీ స్థానం నుంచి తన పోటీ ఖాయమని చెప్పారు. పార్టీ విధి విధానాలు నచ్చడం వల్లే కాంగ్రెస్‌లో చేరుతున్నానన్నారు. తమ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. 

ఇండియా కూటమి గెలవాలి లేకపోతే..: భాజపాపై స్టాలిన్ తీవ్రవ్యాఖ్యలు

తల్సారా ప్రాంత ప్రజలను గత పాలకులు ఓటు బ్యాంకుగా వాడుకొని, విస్మరించారని ప్రబోధ్‌ ఆరోపించారు. ఒడిశా రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల ఆదివాసీలకు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని విమర్శించారు. 2000లో జరిగిన జూనియర్‌ ఆసియా కప్‌ ద్వారా ప్రబోధ్‌ వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత సబ్‌-జూనియర్‌ జాతీయ కెప్టెన్‌, జూనియర్‌, ఇండియా-ఎ టీమ్‌ల కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆటలో అత్యున్నతంగా రాణిస్తూ ఇండియా సీనియర్‌ టీమ్ కెప్టెన్‌ స్థాయికి ఎదిగారు. దేశం తరఫున మొత్తం 135 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి ప్రఖ్యాత హాకీ ప్లేయర్‌గా గుర్తింపు పొందారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని