MK Stalin: ఇండియా కూటమి గెలవాలి లేకపోతే..: భాజపాపై స్టాలిన్ తీవ్రవ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin).. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు పాడ్‌కాస్ట్‌(podcast)లో మాట్లాడారు. 

Published : 04 Sep 2023 11:18 IST

చెన్నై: పాలనాపరమైన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి భాజపా(BJP) మతాన్ని తన ఆయుధంగా చేసుకుంటోందని తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK Stalin) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ అనే పాడ్‌కాస్ట్‌(podcast)లో సోమవారం ఆయన కమలం పార్టీపై విమర్శలు గుప్పించారు.

‘వారు ప్రజల మతపరమైన భావాలను రెచ్చగొడుతున్నారు. ఆ మంటల్లో చలికాచుకుంటున్నారు. దేశ నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్నారు. దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారు’ అని భాజపా(BJP) నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమలం పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో తన హామీలను వేటినీ నెరవేర్చలేదన్నారు. భారత పార్లమెంట్‌లో మూడో అతిపెద్ద పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న తాను.. దేశం కోసం మాట్లాడాలనుకుంటున్నానని, అదే ఈ పాడ్‌కాస్ట్ ఉద్దేశమని చెప్పారు. పాడ్‌కాస్ట్ సిరీస్‌లో ఈ రోజు మొదటి ఎపిసోడ్ విడుదలైంది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. 

అసెంబ్లీ ఎన్నికల్ని ముందుకు జరపం

ఈ సందర్భంగా ఆయన(MK Stalin) మాట్లాడుతూ మణిపుర్, హరియాణాలో వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణను ప్రస్తావించారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడారు. భారత్ మొత్తం మణిపుర్, హరియాణాగా మారకుండా నిరోధించడానికి ప్రతిపక్షాల కూటమి ఇండియా కచ్చితంగా గెలవాలన్నారు. సామాజిక న్యాయం, సమాఖ్య భావన, లౌకికవాద రాజకీయాలను పునరుద్ధరించేందుకు తమ కూటమి ఏర్పడిందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను భాజపా ఖండించింది. పాడ్‌కాస్ట్‌లో చెప్పిన విషయాలన్నీ అవాస్తవాలంటూ తోసిపుచ్చింది. 

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఐక్యతారాగం వినిపిస్తున్నాయి. తాజాగా ముంబయిలో సమావేశమైన ఆ పార్టీలు.. సాధ్యమైనంతవరకు కలిసే పోరాడనున్నట్లు చెప్పాయి. ఈ సమయంలో రాజకీయంగా తనవంతు ప్రభావం చూపేందుకు స్టాలిన్ ఈ పాడ్‌కాస్ట్‌ను వేదికగా చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే..  సనాతన ధర్మంపై స్టాలిన్‌(MK Stalin) తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను భాజపా, విశ్వ హిందూ పరిషత్‌తోపాటు హిందూ సంఘాలు ఆదివారం ఖండించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని