ఆ రహస్యమేంటి జగనన్నా.. క్యాష్ అంతా ఎక్కడికి చేరుతోంది?: మాజీ మంత్రి గంటా ఫైర్‌

టీ స్టాల్ దగ్గర నుంచి కిళ్లీ కొట్టు వరకు అన్ని చోట్లా డిజిటల్ పేమెంట్ ప్రపంచం నడుస్తుంటే.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్‌కు నో ఛాన్స్ అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.

Updated : 12 Feb 2024 10:18 IST

అమరావతి : టీ స్టాల్ దగ్గర నుంచి కిళ్లీ కొట్టు వరకు అన్ని చోట్లా డిజిటల్ పేమెంట్ ప్రపంచం నడుస్తుంటే.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్‌కు నో ఛాన్స్ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ‘‘అంతా క్యాష్ మయం..! ఏంటీ రహస్యం? ఈ క్యాష్ అంతా ఎక్కడికి చేరుతుంది జగనన్నా..? వీటికి లెక్కా పత్రాలు ఏమైనా ఉన్నాయా..? ఇంత విచ్చలవిడిగా నాసిరకం మద్యం అమ్మి పేదోడిని దోపిడీ చేసిన ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్రలు తిరగేసినా దొరకరేమో’’ అంటూ ఎక్స్‌ (ట్విటర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘రేట్ల సంగతి దేవుడెరుగు.. బ్రాండ్‌లన్నీ.. భ్రాంతిలా మార్చారు. నికార్సైన సరకుకు ఏనాడో స్వస్తి పలికారు. ఐదేళ్లుగా ‘J’ బ్రాండులతో హానికర కిక్‌ నింపారు. మద్య నిషేధం అమలు చేసి ఓటు అడుగుతానన్న హామీకి విరుద్ధంగా.. మద్యం ఆదాయాన్ని చూపిస్తూ 15 ఏళ్లు బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఘనత మీది. నాసిరకం మద్యం వల్ల 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారు. అందులో 30 వేల మంది ప్రాణాలు తీశారు.

మద్యంతో దోపిడీ చేసి వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. 'జగనన్న సురక్ష' అంటూ మళ్లీ ప్రజల వద్దకు వెళ్తున్నారు. అమ్మఒడి పేరుతో ప్రభుత్వం వేస్తున్న డబ్బులకు.. నాన్న బుడ్డీతో లెక్క సరి చేస్తున్నారు. మద్యం ఏరులై పారిస్తూ.. కల్తీ మద్యానికి ఇష్టానుసారంగా రేట్లు పెట్టి పేదోడిని దోపిడీ చేస్తున్న మీకు బుద్ధి చెప్పడానికి అదే పేదోడు సిద్దంగా ఉన్నాడు జగన్‌’’ అని గంటా ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని