Ganta SrinivasaRao: చిరంజీవి కూడా అలా మాట్లాడారంటే అర్థం చేసుకోండి: గంటా ట్వీట్‌

చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మంత్రులు, వైకాపా నేతలు తప్పుబడుతూ విమర్శలు చేయడంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.

Updated : 08 Aug 2023 22:29 IST

విశాఖ: ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైకాపా నేతలు వరుసగా మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేయడాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుబట్టారు. విమర్శలు, వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవికి సైతం ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోండని సూచించారు. ‘చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది..? నిజమే మాట్లాడారు.. ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు.. అంతేకదా!’ అని గంటా ట్వీట్‌ చేశారు.

మీరు గిల్లితే ఎదుటి వారూ గిల్లుతారు: చిరంజీవి వ్యాఖ్యలపై పేర్నినాని

‘‘మీరు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టుల గురించి.. పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి. అలా కాదని పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలాగా ఇండస్ట్రీ మీద పడతారేంటీ? ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారు’’ అని చిరంజీవి చేసిన వ్యాఖ్యలను గంటా తన ట్వీట్‌లో ప్రస్తావించారు. చిరంజీవి చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని అభివృద్ధి వైపు దృష్టి పెట్టకుండా పట్టుమని పది నిమిషాలు కూడా తమ శాఖల గురించి మాట్లాడలేని మంత్రులంతా మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఏదేదో ఆయన గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా ఉద్యోగాలు, పేదలపై దృష్టి సారించాలన్న చిరంజీవి వ్యాఖ్యలను తెలుగు ప్రజలందరూ సమర్థిస్తున్నారని పేర్కొంటూ WearewithChiru, MegastarChiranjeevi అనే హ్యాష్‌ ట్యాగ్‌లను జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని