Chiranjeevi comments: మీరు గిల్లితే ఎదుటి వారూ గిల్లుతారు: చిరంజీవి వ్యాఖ్యలపై పేర్నినాని

చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని, మంత్రి గుడివాడ అమర్నాథ్‌లు స్పందించారు. ఎదుటి వారికి సలహా ఇచ్చే ముందు తన తమ్ముడికి సలహా ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Updated : 08 Aug 2023 18:54 IST

అమరావతి: ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతున్నాయి. ఉదయం నుంచి మంత్రులు, వైకాపా నాయకులు వరుసగా విలేకరులతో మాట్లాడుతున్నారు. ‘బ్రో’ సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పాత్రను పెట్టి హేళన చేయడాన్ని విమర్శించారు. ‘మీరు గిల్లితే ఎదుటివారూ గిల్లుతారు. అది చూడలేకపోతున్నానని బాధపడితే కుదరదు’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని (Perni nani) వ్యాఖ్యానించారు.

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?: చిరంజీవి

అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా నేను చిరంజీవిగారికి అభిమానిని. ఆయన నా హీరో. చదువుకునే రోజుల్లో ఆయన సినిమా విడుదలైతే దండలు వేసిన సందర్భాలూ ఉన్నాయి. ప్రభుత్వంపై అభిమాన హీరో చిరంజీవి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఒక అభిమానిగా ఆయనకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. హైదరాబాద్‌ ఫిలింనగర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి ఎంత దూరమో.. ఇక్కడి నుంచి అక్కడికీ అంతే దూరం. ధృతరాష్ట్రుని పుత్రప్రేమ అప్పుడు రాజ్యానికి నష్టం చేకూర్చింది. ఈరోజు అలాంటి ప్రేమవల్ల  సమాజానికి నష్టం చేకూరే పరిస్థితులు వస్తాయి. సినిమాలు, రాజకీయాలు రెండూ వేర్వేరు. చిరంజీవి, రామ్‌చరణ్‌, జూ. ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రవితేజ, మహేశ్‌బాబు, ఇతర నటీనటులపై ఏ రాజకీయ పార్టీ వ్యాఖ్యలు చేయలేదు. కానీ, సంక్రాంతికి డ్యాన్స్‌ వేసిన ఒక రాజకీయ నాయకుడిని అవమాన పరిచేలా సినిమాలో సన్నివేశం పెట్టారు. అసలు కథకు సంబంధం లేని విషయాన్ని ఒక నటుడి పాత్ర ప్రవేశపెట్టి, కక్ష తీర్చుకోవాలనుకున్నప్పుడు అన్నీ పరిణామాలను ఎదుర్కోక తప్పదు. అదేదో సినిమాలో ‘గిచ్చితే గిల్లించుకోవాలి’ అనే డైలాగ్‌ ఉంది.  అది సినిమాలో బాగుంటుందని కానీ, నిజ జీవితంలో నువ్వు గిల్లితే, ఎదుటి వారూ గిల్లుతారు. ఇండస్ట్రీలోని ఏ నటుడి రెమ్యునరేషన్‌ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అవతలి వ్యక్తిని తిట్టినప్పుడు బాగుందని అనిపిస్తే, ‘మా అబ్బాయినో, అమ్మాయినో తిడుతుంటే చూడలేకపోతున్నా’ అనడం కుదరదు. విలన్‌ను హీరో తిడుతుంటే చూడటానికి సినిమాల్లోనే బాగుంటుంది’’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

ముందు తమ్ముడికి సలహా ఇస్తే బాగుండేది: అమర్నాథ్

చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (gudivada amarnath) కూడా స్పందించారు. ‘‘చిరంజీవి అంటే నాకు గౌరవం ఉంది. సినిమాల్లోకి రాజకీయాలను లాగొద్దని అన్నట్లు నాకు తెలిసింది. అది మాకంటే ముందు ఆ మురికి  మాటలు మాట్లాడిన వారి తమ్ముడికి చెప్పి ఉంటే బాగుండేది. ఆ తర్వాత మాకు, మా ప్రభుత్వానికి, మా రాజకీయ పార్టీలకూ సలహా ఇస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఈ రకంగా ఏది పడితే, అది మాట్లాడటం సరికాదు. సినిమాల్లోకి రాజకీయాలను తీసుకొచ్చింది ఎవరో అందరికీ తెలుసు. ఒక రాష్ట్ర మంత్రి అయిన అంబటి రాంబాబును పాత్ర పెట్టి, హేళన చేశారు. పైగా అది మంత్రి పాత్రేనని ఆ సినిమాలో నటించిన ఎవరికీ చెప్పే ధైర్యం లేదు. మళ్లీ ఎవరైనా ఏదైనా అంటే బాధపడుతున్నారు’’ అని అమర్నాథ్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని