నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను అణచివేసే కుట్ర

రాష్ట్రంలో నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను అణచివేసే కుట్ర జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపితే పేపర్‌ లీకేజీ కుట్రదారుల బండారం బయటపడే అవకాశం ఉండటంతోనే ప్రభుత్వం వెనుకంజ వేస్తోందన్నారు.

Updated : 21 Mar 2023 06:33 IST

బండి సంజయ్‌ ఆరోపణ
ప్రజలకు నమ్మకం సడలినందునే సీఎం లేఖ రాశారని విమర్శ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను అణచివేసే కుట్ర జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపితే పేపర్‌ లీకేజీ కుట్రదారుల బండారం బయటపడే అవకాశం ఉండటంతోనే ప్రభుత్వం వెనుకంజ వేస్తోందన్నారు. ఆధారాలు సమర్పించాలని కోరేందుకే నోటీసులు జారీ చేసినట్లు సిట్‌ అధికారులు చెబుతున్నారని, ఇదే నిజమైతే మంత్రి కేటీఆర్‌కూ నోటీసులివ్వాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తన పాత్ర ఉన్నట్లు కేటీఆర్‌ ఆరోపణలు చేశారని, దీనికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని ఆయనకు సిట్‌ నోటీసులిస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో సిట్‌ల ద్వారా జరిగిన ఏ విచారణా కొలిక్కి రాలేదని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిట్‌ విచారణ పేరుతో కిందిస్థాయి సిబ్బందిని ఇరికించి కేసును నీరుగార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించే వరకు భాజపా పోరాటం కొనసాగిస్తుందన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తే తమ వద్దనున్న సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సంజయ్‌ స్పష్టం చేశారు.

పంట నష్టపరిహారం ఇవ్వాలని సీఎంకు లేఖ

రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. పంటనష్టం అంచనాలను రూపొందించి రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంజయ్‌ సోమవారం బహిరంగలేఖ రాశారు. 13 జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. కేంద్రానికి పేరు వస్తుందని రాష్ట్రంలో ఫసల్‌ బీమా పథకాన్ని అమలు చేయలేదని, ఫలితంగా రైతులకు పరిహారం అందడం లేదని వాపోయారు. కౌలు రైతులను ఆదుకోవాలని సంజయ్‌ అన్నారు.

కేంద్రంపై బురదజల్లే కుట్ర

రాష్ట్ర ప్రజలతో పాటు భారాస నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి కుటుంబంపై, భారాస నాయకత్వంపై నమ్మకం సడలిందని సంజయ్‌ అన్నారు. కుటుంబ అవినీతిపై చర్చ జరగకుండా కార్యకర్తల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో భాగంగానే కేసీఆర్‌ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ప్రజలకు సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. సీఎం లేఖ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులిస్తున్నా దారి మళ్లిస్తూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి తిరిగి కేంద్రంపై బురదచల్లే కుట్రలకు తెరతీశారన్నారు. భాజపా అధికారంలోకి వస్తే ఏటా యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడంతో పాటు పేదలందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. రైతులకు ఫసల్‌ బీమా యోజన అమలు చేస్తామని సంజయ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని