Raghurama: నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు

‘నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు. గతంలో తెదేపాలో తలెత్తిన సంక్షోభం లాంటిది మన పార్టీలో తలెత్తకుండా చూసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు.

Updated : 28 Mar 2023 07:51 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: ‘నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు. గతంలో తెదేపాలో తలెత్తిన సంక్షోభం లాంటిది మన పార్టీలో తలెత్తకుండా చూసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ మంచివారైనా లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావడంతో 1995లో తెదేపాలో సంక్షోభం తలెత్తిందన్నారు. ‘సజ్జల రామకృష్ణారెడ్డి మన పార్టీలో లక్ష్మీపార్వతిలా వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పరిస్థితి చేయి దాటకముందే ఆయనను పక్కన పెట్టకపోతే ఎక్కువమందిలోనో అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పటికీ మెజారిటీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రేమిస్తున్నారు. ఎమ్మెల్యేలను ఒకప్పటి సాక్షి దినపత్రిక ఉద్యోగి సజ్జల రామకృష్ణారెడ్డికి రిపోర్టు చేయాలనడం సరికాదు..’ అని పేర్కొన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థికి ఓటు వేయలేదని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ఆనం ప్రశ్నించిన తీరు సహేతుకంగానే ఉందని రఘురామ చెప్పారు. ‘వైకాపా కోసం మేకపాటి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. వైకాపా స్థాపించాలనుకున్నప్పటి నుంచి మేకపాటి గౌతంరెడ్డి ఆ పార్టీకి వెన్నెముకగా ఉన్నారు. జగన్‌ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయనకు మద్దతుగా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయమంగళ వెంకటరమణకు ఓటు వేశానని, అందుకే ఆయన గెలిచారని చంద్రశేఖర్‌రెడ్డి చెబుతున్నారు. అటువంటి వ్యక్తిని అంతర్గత నివేదికల ఆధారంగా సస్పెండ్‌ చేశామని చెప్పడం సిగ్గుచేటు..’ అని రఘురామ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని