Nara Lokesh: వైకాపా ఎమ్మెల్యేల భూకబ్జాలపై ప్రత్యేక సిట్‌

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణ సమీపంలోని ఎర్రగుట్టను వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్రమించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అరోపించారు.

Updated : 02 Apr 2023 05:43 IST

ధర్మవరంలో ఎర్రగుట్టను ఆక్రమించిన కేతిరెడ్డి
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణ సమీపంలోని ఎర్రగుట్టను వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్రమించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అరోపించారు. గుట్టపై సుమారు 20 ఎకరాలు ఆక్రమించి విలాసవంతమైన భవనంతో పాటు రేసింగ్‌ ట్రాక్‌, గుర్రపు స్వారీ, బోటింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నారన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే ఈ భూ అక్రమాలపై విచారణ చేయిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని వైకాపా ఎమ్మెల్యేలందరి భూ కబ్జాలపై ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసి విచారణ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎర్రగుట్టపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిర్మించిన విలాసవంతమైన భవనం డ్రోన్‌ వీడియోను విడుదల చేశారు. యువగళం పాదయాత్ర 57వ రోజు శనివారం రాప్తాడు నియోజకవర్గం నుంచి ధర్మవరం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ధర్మవరం చెరువు అవతలివైపు ఉన్న ఎర్రగుట్టను చూపిస్తూ లోకేశ్‌ సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ అక్రమాలపై ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నెంబర్లలో ఎర్రగుట్ట ఉంది. అందులోని 15 ఎకరాలను దొంగ పత్రాలు సృష్టించి ఎమ్మెల్యే కేతిరెడ్డి కాజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫైనాన్స్‌ కంపెనీలో ఈ భూములు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్లు రికార్డులు సృష్టించారు. రుణాలు చెల్లించకపోవడంతో సదరు భూమిని వేలం వేసినట్లు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కొన్నట్లు పత్రాలు సృష్టించారు. ఎర్రగుట్టపై ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబ సభ్యురాలు పేరుతో మరో 5 ఎకరాలు ఆన్‌లైన్‌ నమోదు చేశారు. ఈ భూమి ఆమెకు అనువంశికంగా వచ్చినట్లు రికార్డులో చూపారు. ఆమెది కర్నూలు జిల్లా. అనువంశికంగా ఆమెకు ధర్మవరంలో భూమి ఎలా సంక్రమిస్తుంది? మరో రెండు సర్వే నెంబర్లలోని సుమారు 80 ఎకరాల ఎస్సీల భూములను లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ విషయం ఎస్సీ కమిషన్‌ వరకు వెళ్లడంతో అప్పటి కలెక్టర్‌ గంధం చంద్రుడు అడ్డుకున్నారు. ఆయన్ను బదిలీ చేయించారు...’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉద్యోగులు నిజాయతీగా ఉండాలని నీతులు చెబుతుంటారని, ఆయన మాత్రం గుట్టలు దోచేస్తుంటారని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

కాపు కార్పొరేషన్‌ను జగన్‌ నిర్వీర్యం చేశారు

పాదయాత్రలో లోకేశ్‌ను బలిజ సామాజికవర్గం ప్రతినిధులు కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.50 లక్షల వరకు రాయితీ రుణాలు ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. లోకేశ్‌ స్పందిస్తూ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి రాగానే కార్పొరేషన్‌కు విరివిగా నిధులు కేటాయించి రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. తనను కలిసిన రజక సామాజికవర్గం ప్రతినిధులతో మాట్లాడుతూ రజక సంక్షేమానికి నిధులు కేటాయించడంతో పాటు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని