Bandi Sanjay: టీఎస్‌పీఎస్‌సీ కేసులో సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలి: బండి సంజయ్‌

టీఎస్‌పీఎస్‌సీ కేసులో సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. వరంగల్‌లో  నిర్వహించిన భాజపా ‘నిరుద్యోగ మార్చ్‌’ సభలో బండి సంజయ్‌ పాల్గొన్నారు.

Published : 15 Apr 2023 20:26 IST

వరంగల్‌: టీఎస్‌పీఎస్‌సీ కేసులో సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. వరంగల్‌లో నిర్వహించిన భాజపా ‘నిరుద్యోగ మార్చ్‌’ సభలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. కాకతీయ కూడలి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసి నష్టపోయిన బాధిత యువతకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఇచ్చే వరకు నిద్రపోనని చెప్పిన కేసీఆర్‌ను ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. భాజపాకు రాజకీయాలు ముఖ్యం కాదని, 30లక్షల మంది యువత భవిష్యత్‌ ముఖ్యమని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకే ఓరుగల్లులో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించినట్టు చెప్పారు.

నోటిఫికేషన్‌ కూడా సరిగా ఇవ్వలేని ఈ ప్రభుత్వం.. అన్ని పేపర్ల లీకులకూ బండి సంజయే కారణమని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సమక్షంలో దోషులు సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ ఇంట్లోని వారంతా దందాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీలో తప్పు లేకుంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. సిట్‌పై తమకు నమ్మకం లేదని, సిట్‌ దర్యాప్తు చేసిన ఏ కేసులోనూ సరిగా చేయలేదన్నారు.  

‘‘టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకై 30లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడినా  సీఎం కేసీఆర్‌  ప్రగతి భవన్‌ నుంచి బయటకు రాలేదు.  వారికి   భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు. కాకతీయ యూనివర్సిటీలో సునీల్‌ నాయక్‌ ఆత్మహత్య చేసుకున్నా సీఎం స్పందించలేదు. ఇంటర్‌ విద్యార్థులు చనిపోయినా, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న, రైతులు చనిపోయినా సీఎం స్పందించలేదు.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో ఇబ్బందులు పడి నిరుద్యోగులు హైదరాబాద్‌ వస్తారు.  కానీ, ఉద్యోగాల పేరుతో కేసీఆర్‌ యువతను మోసం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే నిరుద్యోగ మార్చ్‌. ఈనెల 21న పాలమూరులో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తాం. త్వరలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో ,హైదరాబాద్‌లో లక్షలాది మందితో నిరుద్యోగ మార్చ్‌నిర్వహిస్తాం’’ అని బండి సంజయ్‌ తెలిపారు. భాజపా నేతలు లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు,ప్రేమేందర్‌రెడ్డి, గరికపాటి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని