Nara Lokesh: ఇసుకపై సీఎం జగన్‌కు రోజుకు రూ.3 కోట్ల ఆదాయం

ఇసుకపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి రోజుకు రూ.3 కోట్ల ఆదాయం వస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.

Updated : 15 May 2023 09:25 IST

పాదయాత్రలో నారా లోకేశ్‌

ఈనాడు, కర్నూలు: ఇసుకపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి రోజుకు రూ.3 కోట్ల ఆదాయం వస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. యువగళం పాదయాత్ర ఆదివారం నంద్యాల జిల్లా ఆత్మకూరు, వెలుగోడు మండలాల పరిధిలో కొనసాగింది. మొత్తం 16.2 కి.మీ. నల్లమల ప్రాంతంలో కొనసాగింది. ది టైగర్‌ క్యాంపెయిన్‌ ప్రతినిధులు, ఇండియా వైల్డ్‌ లైఫ్‌ కన్జర్వేషన్‌ సొసైటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఇమ్రాన్‌ సిద్దిఖి తదితరులు నారా లోకేశ్‌ను కలిశారు. పాదయాత్రలో నడుస్తూనే పులుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాబోయే తరాలకు మంచి జీవితాన్ని అందించాలన్న ఆశయంతో అడవులు, పులులు, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తున్నామని ఇమ్రాన్‌ సిద్దిఖి లోకేశ్‌కు వివరించారు. అనంతరం వెలుగోడు విడిది కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులతో ఆదివారం ముఖాముఖి నిర్వహించారు.

లోకేశ్‌ మాట్లాడుతూ తెదేపా హయాంలో ఇసుక ధరతో పోలిస్తే ప్రస్తుతం ఐదు రెట్లు పెరిగిందని అన్నారు. జగన్‌ పాలనలో సిమెంటు ధర రెట్టింపైందని.. భారీగా సిమెంటు ధర పెరగడం గతంలో ఏ ప్రభుత్వాల సమయంలోనైనా జరిగిందా అని ప్రశ్నించారు. కొందరు మాఫియా ముఠాగా మారి ధరలు పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి సిమెంట్‌ బస్తాపై జగన్‌కు వాటా వెళ్తుందని... అందుకే సిమెంట్‌ ధర అంతగా పెరిగిందన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులేనని పేర్కొన్నారు. కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టకుండా పాత ఇసుక విధానాన్ని రద్దు చేయడంతో నెలలపాటు పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ట్రాక్టర్‌ ఇసుక రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు విక్రయిస్తున్నారని... ఆ డబ్బంతా ప్రస్తుతం ఎవరు దోచుకుంటున్నారని ప్రశ్నించారు. పెరిగిన ధరలతో సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అందరికీ పనులు లభించేలా చూస్తాం

తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకకు సంబంధించి నూతన విధానాన్ని తీసుకొచ్చి ధరలు తగ్గిస్తామని లోకేశ్‌ ప్రకటించారు.  తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ మళ్లీ మొదలుపెడతామని, భవన నిర్మాణ కార్మికులందరికీ పనులు దొరికేలా చూస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

పిల్లకాల్వ అయినా తవ్వించావా జగన్‌?

రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నై వాసులకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్‌ హయాంలో వెలుగోడు వద్ద నిర్మించిన తెలుగు గంగ జలాశయాన్ని యువనేత సందర్శించారు. 16.4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌ ద్వారా సీమలోని 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు, చెన్నైకి తాగునీరు అందుతోందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1996 సెప్టెంబరు 23న ఈ ప్రాజెక్టు నుంచి తొలిసారి చెన్నైకి తాగునీరు వెళ్లిందని చెప్పారు. ఎన్టీఆర్‌, చంద్రబాబుల ముందుచూపు, కరవు సీమపై వారికున్న ప్రేమకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని లోకేశ్‌ పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాయలసీమ ప్రజల కోసం ఒక్క పిల్లకాల్వ అయినా నిర్మించావా జగన్‌  అంటూ లోకేశ్‌ ప్రశ్నించారు.


నేడు పాదయాత్రలో పాల్గొననున్న భువనేశ్వరి

నారా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర 99 రోజులు పూర్తి చేసుకుంది.. సోమవారం వందవ రోజుకు చేరుతుంది.. లోకేశ్‌ తల్లి భువనేశ్వరితోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, లోకేశ్‌ చిన్ననాటి స్నేహితులు యాత్రలో పాల్గొంటారు. భువనేశ్వరి ఆదివారం రాత్రి బోయరేవుల క్యాంప్‌ సైట్‌కి చేరుకున్నారు. మాతృదినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని