Siddaramaiah: మొగ్గు సిద్ధరామయ్య వైపేనా!

కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 

Updated : 16 May 2023 07:11 IST

ఉప ముఖ్యమంత్రులు ఎందరనేదే ప్రశ్న  
ఈడీ, ఐటీ కేసులు డీకేకు అడ్డంకిగా మారవచ్చని సమాచారం

ఈనాడు-దిల్లీ, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.  పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను గౌరవప్రదంగా ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీని శివకుమార్‌ అన్ని విధాలా ముందుకు నడిపించి అధికారంలోకి తేవడంలో కీలక భూమిక పోషించినప్పటికీ ఆయనపై ఉన్న ఈడీ, ఆదాయపు పన్ను కేసులే ఇప్పుడు అడ్డంకిగా మారవచ్చని తెలుస్తోంది. ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తే భాజపా నాయకత్వం మరింత గురిపెట్టి ఏదోవిధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంటుందని, అది కాంగ్రెస్‌కు మున్ముందు సమస్యగా మారుతుందన్న ఉద్దేశంతో సిద్ధరామయ్యవైపు పార్టీ మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా శివకుమార్‌కు కీలకమైన మంత్రి పదవులతో ఉపముఖ్యమంత్రి హోదా కట్టబెట్టే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికల్లో మిగతా మైనార్టీలు, ఎస్సీ సామాజిక వర్గం కూడా దోహదం చేసిన నేపథ్యంలో ఆ వర్గాలవారికీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఒకటికి మించిన డిప్యూటీ సీఎంలు ఉంటే తనకు ప్రాధాన్యం ఉండదన్న కారణంతో శివకుమార్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఒకటే డిప్యూటీ సీఎం పదవి ఉండాలని డీకే పట్టుబడితే మిగతా వర్గాలకు ఎలా నచ్చజెప్పాలన్న అంశంపైనా ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని తనకు అప్పగిస్తూ సీఎల్పీలో తీర్మానం చేసినా పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాత్రం పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌లతో సంప్రదించాకే నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు.  

ఇద్దరినీ ఒప్పించాక నేడే ప్రకటన..!

2024 పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌ చెప్పుకోదగ్గ పనితీరు కనబరచాలంటే డీకే శివకుమార్‌ సేవలు చాలా అవసరమని, ఆ నేపథ్యంలో ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి తేవడం సాధ్యంకాదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తగిన సంఖ్యలో లోక్‌సభ స్థానాలు గెలిపించుకోవాంటే సిద్ధరామయ్య, శివకుమార్‌లు ఇద్దర్నీ ఒప్పించి ముందుకు నడిపించడం అత్యంత అవసరమని పార్టీ భావిస్తోంది. డీకేను కూడా దిల్లీకి పిలిపించి చర్చించి, ఒప్పించిన తర్వాతే సిద్ధరామయ్య పేరును అధికారికంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇదంతా మంగళవారమే జరుగుతుందని పార్టీ సీనియర్‌ నేతలు వెల్లడించారు.  తాను ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడినని, పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించిన తనను పార్టీ అధిష్ఠానం ఏ విధంగా సంతృప్తిపరుస్తుందో ఎదురుచూస్తున్నానని డీకే పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేలూ తన మద్దతుదారులేనంటూ.. తాను సీఎం రేసులో ముందున్నానని చెప్పకనే చెబుతున్నారు. వాస్తవానికి సోమవారం డీకే కూడా దిల్లీ వెళ్లాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో అనారోగ్య కారణమంటూ ఆగిపోయారు. మంగళవారం ఆయన దిల్లీకి వెళ్తారని సోదరుడు డీకే సురేశ్‌ తెలిపారు.


నిర్ణయానికి ఎక్కువ సమయం పట్టదు

సూర్జేవాలా

70 మంది శాసనసభ్యులు రాతపూర్వకంగా, 60 మంది రహస్య ఓటింగ్‌ ద్వారా వెల్లడించిన అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ నేతలు సోమవారం దిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై సమాలోచనలు జరిపారు. అభిప్రాయాలు బహిరంగంగా చెప్పడానికి కొందరు ఎమ్మెల్యేలకు ఉన్న ఇబ్బంది దృష్ట్యా వారు రహస్య బ్యాలెట్‌ కూడా నిర్వహించి ఆ పెట్టెలను తమతోపాటు దిల్లీకి తెచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేందుకు ఖర్గేకు ఎక్కువ సమయం పట్టదని పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సూర్జేవాలా చెప్పారు. ‘సీఎల్‌పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలతో రూపొందించిన నివేదిక రహస్యమైనది. దానిని మేం బయటపెట్టలేం. ఖర్గే మాత్రమే బహిర్గతం చేస్తారు’ అని శిందే చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని