Karnataka Elections 2023: కుదరని రాజీ

కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించటంపై కాంగ్రెస్‌ కసరత్తు కొనసాగుతూనే ఉంది. బెంగళూరు నుంచి దిల్లీకి మారిన ప్రహసనం బుధవారం నాటకీయ పరిణామాలకు దారితీసింది.

Updated : 18 May 2023 07:35 IST

కర్ణాటక సీఎం ఎంపికపై హస్తినలో రోజంతా హైడ్రామా
72 గంటల్లోపు కొత్త కేబినెట్‌  ఏర్పాటవుతుందన్న సూర్జేవాలా

దిల్లీ, ఈనాడు - బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించటంపై కాంగ్రెస్‌ కసరత్తు కొనసాగుతూనే ఉంది. బెంగళూరు నుంచి దిల్లీకి మారిన ప్రహసనం బుధవారం నాటకీయ పరిణామాలకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి కానున్నారన్నది విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. తొలి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, తర్వాత డీకే శివకుమార్‌ సీఎంలుగా ఉంటారనే ప్రచారం జరిగింది. 2013 మే 13న ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసిన బెంగళూరులోని కంఠీరవ స్టేడియం మళ్లీ అదే వేడుక కోసం ముస్తాబవుతుండగా దిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీ వ్యవహారాల బాధ్యునిగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా చేసిన ప్రకటన దానికి కారణం. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటిస్తారని, మరో 48-72 గంటల్లో కేబినెట్‌ ఏర్పాటవుతుందని ఆయన స్పష్టంచేశారు. వివిధ మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని సూచించారు.


ఖర్గే, సోనియాలతో ఎడతెగని చర్చలు

దిల్లీలోనే తిష్టవేసిన సిద్ధరామయ్య బుధవారం ఉదయమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో దాదాపు 45 నిమిషాలు చర్చించారు. అనంతరం నేరుగా సోనియా నివాసానికి వెళ్లారు. గంటపాటు చర్చల్లో పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు. చర్చల వివరాలేవీ వెల్లడించకుండా వారు మౌనం వహించారు. సిద్ధరామయ్య తర్వాత ఖర్గే, సోనియా నివాసాలకు డీకే వెళ్లి వచ్చిన తర్వాత పరిస్థితి అంతా తారుమారైంది. సిద్ధూ, డీకే కూడా రాహుల్‌గాంధీతో వేర్వేరుగా భేటీ అయ్యారు. అక్కడి నుంచి శివకుమార్‌ నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. బయటకు వచ్చిన శివకుమార్‌.. ప్రసార మాధ్యమాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘మీకు ఇష్టం వచ్చినట్లు రాసుకుంటే నేనెందుకు సమాధానమివ్వాలి’ అని ప్రశ్నించారు. సోనియాతో శివకుమార్‌ ఫోన్లో సంప్రదించినట్లు సమాచారం. ఆమె సూచన మేరకే ఖర్గేతో ఆయన భేటీ అయినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగింది?

అందరూ ఊహిస్తున్నట్లే సీఎం పదవీ కాలాన్ని డీకే, సిద్ధరామయ్య పంచుకోవాలన్న ప్రతిపాదన దిల్లీ చర్చల్లో వచ్చినట్లు సమాచారం. సిద్ధరామయ్య మొదటి నుంచీ ప్రతిపాదిస్తున్నట్లే ఖర్గే, సోనియాగాంధీ ఈ విధానానికి ఆమోదించినట్లు తెలిసింది. ఈ సమయంలో డీకేకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆయన కోరుకున్న శాఖలు ఇచ్చేందుకు కూడా అధిష్ఠానం అంగీకరించినట్లు సమాచారం. సీఎం తప్ప మరే స్థానం అవసరం లేదని తెగేసి చెప్పిన డీకే.. బెట్టును కొనసాగించారు. సుదీర్ఘ బుజ్జగింపుల తర్వాత 50:50 సూత్రానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. తొలి రెండున్నరేళ్లకు తానే సీఎంగా ఉండాలన్న నిబంధనకైతేనే అంగీకరిస్తానని డీకే స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఎలాంటినిర్ణయం రాలేదు.

సిద్ధూ శిబిరంలో సంబరాలు

సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందన్న సమాచారాన్ని కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఈశ్వర ఖండ్రే అందించటంతో సిద్ధరామయ్య స్వగ్రామంతో పాటు, బెంగళూరులోని ఆయన నివాసం వద్ద అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని