పొంగులేటి, జూపల్లితో ఈటల భేటీ

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో భాజపా రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ సమావేశం అయ్యారు.

Updated : 26 May 2023 06:26 IST

భాజపాలో చేరాలని ఆహ్వానం!

ఈనాడు, హైదరాబాద్‌: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో భాజపా రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ సమావేశం అయ్యారు. హైదరాబాద్‌ శివారులోని ఓ ఫాంహౌస్‌లో గురువారం ఉదయం జరిగిన ఈ భేటీ 15 నిమిషాలకు పైగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించారు. వారిద్దరిని భాజపాలో చేరాలంటూ ఈటల ఆహ్వానించినట్లు సమాచారం. భారాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. తమ అభిప్రాయాలు చెప్పిన ఆ ఇద్దరు నేతలు.. కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఈటల వెళ్లిపోయిన అనంతరం ఆయన చేసిన ప్రతిపాదనలు, చెప్పిన అంశాలపై పొంగులేటి, జూపల్లి చర్చించుకున్నట్లు సమాచారం. సాయంత్రం ఈ ఇద్దరు నేతలు మరోసారి కలుసుకున్నారు. గతంలోనూ ఖమ్మంలో పొంగులేటితో ఈటల చర్చలు జరిపారు. భాజపాలోకి వెళ్లాలా? కాంగ్రెస్‌లో చేరాలా? అన్న అంశంపై పొంగులేటి, జూపల్లి కొంతకాలంగా తర్జనభర్జన పడుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ ఇద్దరు నేతలు తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈటల పొంగులేటి, జూపల్లిలను కలిశారు. సమావేశం సందర్భంగా ఈ ముగ్గురు నేతల వెంట వ్యక్తిగత, భద్రత సిబ్బంది ఎవరూ లేకపోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు