‘నువ్వు ఎవడ్రా నాకు చెప్పడానికి’.. సచివాలయ దళిత ఉద్యోగిపై చెప్పుతో దాడి..

సచివాలయంలో పనిచేస్తున్న దళిత ఉద్యోగిని వైకాపా నాయకుడొకరు చెప్పుతో కొట్టడంతో పాటు జగన్‌ సీఎం అయ్యాక ఎస్సీలకు ఉద్యోగాలు ఇచ్చి పోషించడంతో వారికి పొగరు పెరిగిందంటూ నానా దుర్భాషలాడారు.

Updated : 01 Sep 2023 07:42 IST

రోడ్డుపై వైకాపా నాయకుడి వీరంగం

నిడదవోలు, న్యూస్‌టుడే: సచివాలయంలో పనిచేస్తున్న దళిత ఉద్యోగిని వైకాపా నాయకుడొకరు చెప్పుతో కొట్టడంతో పాటు జగన్‌ సీఎం అయ్యాక ఎస్సీలకు ఉద్యోగాలు ఇచ్చి పోషించడంతో వారికి పొగరు పెరిగిందంటూ నానా దుర్భాషలాడారు. రోడ్డుపైనే ఊగిపోతూ హంగామా చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చాపల గణపతి.. నిడదవోలు రాయిపేట 10వ సచివాలయంలో శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం 14వ వార్డు రాయిపేటలో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో పనిచేయాల్సిన కార్మికుడు వేరే ప్రాంతంలో పనిచేస్తుండటం గమనించి ప్రశ్నించారు. అక్కడే ఉన్న 14వ వార్డు కౌన్సిలర్‌ బిర్రే పార్వతి భర్త రామకృష్ణ (14వ వార్డు వైకాపా ఇన్‌ఛార్జి) జోక్యం చేసుకుని కార్యదర్శులు వార్డుల్లోకి రారు. ఫోన్లు ఎత్తరు. పారిశుద్ధ్య కార్మికులను పంపరు.. అంటూ దుర్భాషలాడారు. ఇంతలో గణపతి మాట్లాడబోతుండగా ‘నువ్వు ఎవడ్రా నాకు చెప్పడానికి అంటూ’ బూతులు తిడుతూ పీక పట్టుకుని వెనక్కి నెట్టి చెప్పుతో కొట్టి, అతనిపైకి చెప్పులు విసిరారు.

ప్రశ్నించడమే పాపమా..!

ఆ నాయకుడి ఇల్లు 15వ వార్డులో ఉంది. పక్క వార్డులో పని చేయాల్సిన పారిశుద్ధ్య కార్మికుడితో తన ఇంటి వద్ద రహదారి పక్కన మొక్కలు, గడ్డి తొలగించే పనులు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వేరే వార్డులో ఎందుకు పనిచేస్తున్నావని కార్మికుడిని కార్యదర్శి గణపతి అడగడంతోనే రామకృష్ణకు కోపం వచ్చి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ వ్యవహారం మున్సిపల్‌ కమిషనర్‌ పద్మావతి, ఛైర్మన్‌ ఆదినారాయణ దృష్టికి వెళ్లింది. పట్టణ వైకాపా నాయకులు రాజీకి తీవ్రంగా యత్నించినట్లు సమాచారం. గణపతిపై ఒత్తిడి తెచ్చినా ఎమ్మెసీ, బీఈడీ చదివిన గణపతి ఈ అవమానాన్ని భరించలేక నిడదవోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రామకృష్ణ తనను అందరూ చూస్తుండగా దుర్భాషలాడి చెప్పుతో దవడ మీద కొట్టి, తన మీద చెప్పులు విసిరారని గణపతి ఫిర్యాదు చేశారు. దళిత ఉద్యోగిని చెప్పుతో కొట్టిన వైకాపా నాయకుడుపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్‌ రాష్ట్ర నాయకుడు జువ్వల రాంబాబు డిమాండ్‌ చేశారు.


అరిచాను.. కొట్టలేదు..

‘కార్యదర్శిపై కేకలు మాత్రమే వేశాను.. కొట్టలేదు. కార్మికుడు మా ఇంటి రహదారి పక్కన ఉన్న పిచ్చిమొక్కలు, గడ్డి తొలగిస్తుండగా గణపతి వచ్చి, ఇక్కడ పనిచేస్తే పక్కవార్డులో ఎవరు పనిచేస్తాడని కార్మికుడిని ప్రశ్నించాడు. ఆ వార్డులో తర్వాత చేయిస్తానని చెప్పాను. నన్ను ఉద్దేశించి మీ భార్య కౌన్సిలర్‌ మీకు సంబంధం ఏమిటంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో ఇద్దరం కేకలు వేసుకోవడం తప్ప నేను కొట్టలేదు’      

బిర్రే రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని