యూపీలో కాంగ్రెస్‌కు ఇదే మర్యాద చేస్తాం

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి ఒక్క స్థానం కూడా కేటాయించని కాంగ్రెస్‌ పార్టీ వైఖరితో కలత చెందిన ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 20 Oct 2023 04:23 IST

మధ్యప్రదేశ్‌లో పొత్తు బేఖాతరుపై ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ హెచ్చరిక

లఖ్‌నవూ: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి ఒక్క స్థానం కూడా కేటాయించని కాంగ్రెస్‌ పార్టీ వైఖరితో కలత చెందిన ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌తోనూ తాము ఇలాగే వ్యవహరిస్తామని చెప్పారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని లుకలుకలను అఖిలేశ్‌ వ్యాఖ్యలు బహిర్గతం చేశాయి. కాంగ్రెస్‌లోని స్థాయి లేని నాయకులు సమాజ్‌వాదీ పార్టీపై వ్యాఖ్యలు చేయకుండా ఆ పార్టీ నాయకత్వం కట్టడి చేయాలని ఆయన కోరారు. ‘‘ఇండియా కూటమి జాతీయస్థాయి వరకే పరిమితం అని ముందే తెలిస్తే.. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకుల సమావేశాలకు మా నాయకులు వెళ్లేవారు కాదు.  జాబితాలు ఇచ్చేవారు కాదు, వారి ఫోన్లకు స్పందించేవారు కాదు’’ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో తాను గందరగోళానికి గురయ్యానంటూ అఖిలేశ్‌ వ్యంగ్య బాణాలు వదిలారు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 33 స్థానాలకు తన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో ఆరు స్థానాలను ఎస్పీకి కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నేతలు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదని అఖిలేశ్‌ చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని బిజ్వార్‌ స్థానం నుంచి గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అయిదు స్థానాల్లో రెండోస్థానంలో నిలిచి 1.30 శాతం ఓట్లు సాధించింది. ‘‘మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌ మావాళ్లను చుట్టూ తిప్పుకొని మొండిచేయి చూపారు. కాంగ్రెస్‌ ఇతర పార్టీలను ఫూల్స్‌ చేస్తోంది’’ అని అఖిలేశ్‌ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని