Yuvagalam: నేటి నుంచి కోనసీమలో ‘యువగళం’

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సోమవారం నుంచి ‘యువగళం’ పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు.

Updated : 27 Nov 2023 07:37 IST

లోకేశ్‌ పాదయాత్ర మళ్లీ ప్రారంభం

ఈనాడు, రాజమహేంద్రవరం: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సోమవారం నుంచి ‘యువగళం’ పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. 79 రోజుల విరామం తర్వాత నేటి ఉదయం 10.19 గంటలకు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి తెదేపా శ్రేణులతో పాదయాత్రగా బయలుదేరనున్నారు. సెప్టెంబరు 8న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర రాజోలు మీదుగా పొదలాడ చేరుకుంది. ఆ మరుసటి రోజు తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు కావడంతో లోకేశ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. చంద్రబాబుకు ఇటీవల బెయిల్‌ మంజూరు కావడంతో యాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో నిర్దేశించిన మార్గంలో కాకుండా.. ఈ సారి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రోజుకు 15 కి.మీ. నుంచి 20 కి.మీ. మేర పాదయాత్ర, మధ్యలో బహిరంగ సభలు, స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తూ ముందుకు సాగనున్నారు.

తెలుపు, పసుపు జెండాల రెపరెపలు: పాదయాత్ర ప్రారంభానికి పార్టీ ప్రధాన నాయకులతో పాటు 175 నియోజకవర్గాల తెదేపా ఇన్‌ఛార్జులు రానున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకులు కోనసీమ చేరుకున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు తదితరులు పొదలాడ చేరుకుని నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ‘యువగళం’ వాలంటీర్లు వంద మంది సేవలకు సన్నద్ధమయ్యారు. పాదయాత్ర సాగే మార్గంలో లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చిత్రాలు, తెదేపా, జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి. పాదయాత్ర పొదలాడ నుంచి 2 కి.మీ. వెళ్లాక తాటిపాక కూడలి వస్తుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించి, లోకేశ్‌ ప్రసంగిస్తారు. తొలిరోజు 15.4 కి.మీ. నడిచి.. అమలాపురం నియోజకవర్గం పెరూరులో రాత్రి బస చేయనున్నారు. ఆదివారం రాత్రి లోకేశ్‌ పొదలాడ చేరుకున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు స్థానిక తెదేపా శ్రేణులు భారీగా స్వాగతం పలికాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని