ఓటమి భయంతోనే చంద్రబాబును అడ్డుకుంటున్నారు

తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందనే భయంతోనే ఆయన్ను బయట తిరగకుండా అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టులో శతవిధాలా ప్రయత్నించారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

Published : 29 Nov 2023 05:54 IST

బయట తిరగనివ్వొద్దని సుప్రీంకోర్టును అభ్యర్థించారు
రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజం

 ఈనాడు, దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందనే భయంతోనే ఆయన్ను బయట తిరగకుండా అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టులో శతవిధాలా ప్రయత్నించారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆయన మంగళవారం ఇక్కడ రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎక్కడున్నా తమకు ఒకటేనని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతుండగా, మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు మాత్రం ఆయన్ను ప్రజల్లో తిరగకుండా ఆంక్షలు జారీచేయాలని కోరడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఇలా కోరినట్లు కనిపిస్తోందన్నారు. స్కిల్‌ కేసులో పూర్తిస్థాయి బెయిలు పొందిన చంద్రబాబు.. ఇక రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లడం ఖాయమని చెప్పారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలైన తర్వాత అమరావతిలోని ఇంటికి రావడానికి చంద్రబాబుకు 14 గంటల సమయం పట్టిన విషయం చూసే ప్రభుత్వ పెద్దలు.. ఆయన్ను తిరగకుండా అడ్డుకొనేందుకు కోర్టులో ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. న్యాయస్థానంలో తమ పార్టీ వారి బేల, పేలవ ప్రదర్శనను చూస్తే తెలుగు ప్రజలు, తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై భగవంతుడి అనుగ్రహం ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు